Pinnelli RamaKrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. మే 13న పోలింగ్ జరుగుతుండగా ఆయన అనుచరులతో కలిసి పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి ధ్వంసం చేశారు. వీవీపాట్‌ను కూడా బద్దలుగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం, ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తుండగా హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ బెయిలు పొందారు. ఆయన బెయిలు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంతో అరెస్ట్‌కు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాలకు ఓటర్లు అడ్డుకట్ట వేశారు. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఘనవిజయం సాధిస్తున్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు ఆయన ముందస్తు బెయిల్ విచారణకు వస్తుండటంతో ఆయన తప్పించుకుని పోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.