అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రాన్ని ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్శించారు.

అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రాన్ని ఆదివారం జనసేన(Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సందర్శించారు. పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర కుంకుమార్చన చేసి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా క్రతువులను ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్తి చేసి అమ్మ ఆశీస్సులు స్వీకరించారు. ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

మొదట విఘ్నేశ్వరుని పూజించి శ్రీ పాద శ్రీవల్లభుడి మూల స్థానం అయిన అవదంభర వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభుని చరిత్రను ఈ సందర్భంగా అర్చక స్వాములు ఆయనకు వివరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యవారు, అమ్మవార్లకు అర్చనలు, శ్రీపాద వలభుని దర్శనానంతరం స్ఫటిక లింగాకారుడైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి పురుహుతికా అమ్మవారి దర్శనానికి వెళ్లారు. శక్తి పీఠంలో ప్రదక్షిణ అనంతరం అమ్మవారికి పట్టు చీర సమర్పించారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అత్యంత మహిమాన్విత శ్రీ చక్రాన్ని తాకి మొక్కులు మొక్కారు. అనంతరం పురుహుతిక అమ్మవారి ఆలయం మండపంలో వేద ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందచేశారు.

దత్త పీఠ సందర్శన, అమ్మవారి దర్శనానంతరం ప్రముఖ దత్త క్షేత్రంగా పేరున్న దత్తపీఠానికి వెళ్లారు. అక్కడ శ్రీపాద వల్లభుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి కరుణ కటాక్షాలు పవన్ కళ్యాణ్ ఆకాంక్షలు సిద్ధించాలన్న సంకల్పంతో వేద మంత్రోచ్చరణలతో అర్చనలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీ పాదవల్లభునికి పట్టువస్త్రాలు సమర్పించారు. మోకాళ్లపై కూర్చొని దత్తాత్రేయునికి మొక్కారు. స్వామి వారికి పూజలు చేసిన ప్రత్యేక వస్త్రాలతో పవన్ కళ్యాణ్ ని సత్కరించారు. దత్తపీఠం ఆవరణలో ఉన్న అవదంభర వృక్షానికి నారికేళ ముడుపు కట్టి మొక్కులు మొక్కారు. ఈ కార్యక్రమంలో కాకినాడ లోక్ సభ జనసేన పార్టీ అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజక వర్గ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Updated On 31 March 2024 4:15 AM GMT
Yagnik

Yagnik

Next Story