విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. భీమవరంలోని విష్ణు కాలేజీలో బిల్డింగ్ ల మధ్య హెలికాప్టర్ లో దిగుతాడంట

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదంటూ భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నారు. వేరే ప్రాంతంలో హెలికాఫ్టర్ ల్యాండ్ చేసుకోండి.. ఇక్కడ వద్దని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఇదే సాకుగా చూపించి భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. భీమవరంలోని విష్ణు కాలేజీలో బిల్డింగ్ ల మధ్య హెలికాప్టర్ లో దిగుతాడంట.. ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్, ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లు వెళ్లి... బిల్డింగ్ ల మధ్య హెలికాప్టర్ దిగేటప్పుడు రెక్క తగిలితే ప్రమాదం... ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది... మేమేదో చేశాం అంటారు... అందుకే ఇక్కడ కాకుండా ఊరి బయట ఎక్కడైనా దిగి ఊర్లోకి రమ్మని చెప్పారు. నాకు ఇక్కడే అనుమతి కావాలి, లేకపోతే నేను భీమవరం రానంటూ ఆయన మంగళగిరిలో కూర్చున్నాడని కొడాలి నాని అన్నారు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అని అడుగుతారు, పార్టీ నేతలు కూడా ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అని అడుగుతారు, మీడియా వాళ్లకు కూడా సమాధానం చెప్పాలి. వాళ్లు అడిగిన దానికి ఈయన సమాధానం చెప్పాలి. ఈయన సమాధానం చెప్పాలంటే ఢిల్లీ వాళ్లు చెప్పాలి. ఇవన్నీ తప్పించుకోవడానికి పర్యటనలు వాయిదా వేసుకుంటున్నాడని అన్నారు కొడాలి నాని. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి ఎంత సేపు పడుతుంది? కార్లో గంటన్నరలో వెళ్లిపోవచ్చు. హెలికాప్టర్ లోనే వెళ్లాలా? హెలికాప్టర్ ల్యాండ్ కాకపోతే ఈయన వెళ్లడా? భీమవరంలో పోటీ చేసేట్టయితే, ప్రతిసారి హెలికాప్టర్ ఉంటేనే అక్కడకు వెళతాడా? ఇది భీమవరం ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. మీ ఎమ్మెల్యేగారు హెలికాప్టర్ లేకపోతే రాలేడంట. కనీసం ఊరి బయట కూడా దిగడంట... ఊర్లోనే బిల్డింగుల మీద దిగుతాడంట అని అన్నారు కొడాలి నాని.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 14 నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని భావించారు. ఫిబ్రవరి 14న భీమవరం నుంచి తన పర్యటన ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అనుకున్నప్పటికీ.. ఆయన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో భీమవరం వెళ్లాలనుకున్నారు. భీమవరంలో జనసేన నేతలు హెలిప్యాడ్ కూడా సిద్ధంచేశారు. అయితే, అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Updated On 14 Feb 2024 10:13 PM GMT
Yagnik

Yagnik

Next Story