Pawan Kalyan : ముందు నన్ను.. నా పార్టీని గెలిపించండి.. సీఎం అభ్యర్థిపై తర్వాత చర్చ చేద్దాం
నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. మంచి పని చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకూడదన్నారు
నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. అమరావతి(Amaravathi)లో ఆయన మాట్లాడుతూ.. మంచి పని చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకూడదన్నారు. నా సినిమాలు ఆపినా.. బెదిరించినా నేనెప్పుడూ జాతీయ స్థాయి నాయకులను అడగలేదని.. నా పోరాటం నా గడ్డపై నేనే చేశానని.. నా ఇబ్బందులను నేనే ఎదుర్కొని నిలబడతానని స్పష్టం చేశారు.
నేడు టీడీపీ(TDP), జనసేన(Janasena) కలిసి వెళ్లడానికి కార్యకర్తలు కూడా ఒక కారణం అని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పని చేశాయని.. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. చిన్న పొస్ట్ పెడితే, ఆలోచన చెప్పినా బెదిరిస్తారు. తమిళనాడు సూపర్ స్టార్(Super Star) ను కూడా వీళ్లు తిట్టేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకూ స్థానం ఉండాలన్నారు.
ముఖ్యమంత్రి ఎవరు అని వివాదం చేయడానికి చూస్తున్నారు. నాకు ఓట్లు వేయనివారే ఇలాంటి అంశాలను తెర పైకి తెస్తారు. నేను గత ఎన్నికలలో పోటీ చేస్తే ఒక్క స్థానం ఇచ్చారు. ముందు నన్ను, నా పార్టీని గెలిపించండి. ఆ స్థానాలను బట్టి సీఎం అభ్యర్థిపై చర్చ చేద్దామని.. వసుదైక కుటుంబం అనే ఆలోచన లేకుండా ఎలా ముందుకు సాగుతాం అని ప్రశ్నించారు. కులాలను కలుపుకుని ఐక్యంగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.
వైసీపీ(YCP) ట్రాప్ లో కొంతమంది మపడిపోతున్నారు .వాళ్ల మాయలో పడి క్యాస్ట్ పాలిటిక్స్(Caste Politics) చేయకండి. మానవత్వం ఉన్న వాడు అన్ని కులాలను సమానంగా చూస్తారని పేర్కొన్నారు. ఒక్క కులం అని ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు. వైసీపీ కులాల వారీగా ప్రజలను చీల్చడానికి కుట్ర చేస్తుందన్నారు. 2019లో నేను ఓడినా.. నా వాళ్లే నా వెంట నడిచారు. కొంతమంది వెళ్లిపోతామన్నా.. నేను ఆపను.. అది వాళ్ల ఇష్టం. సీట్ల కోసం వచ్చిన వాళ్లు మాత్రం సీట్లు మార్చుకున్నారు. పెద్ద స్థాయి నుంచి వచ్చామని నా మీద పెత్తనం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తుంది. నాకు ప్రజలు, రాష్ట్రం ముఖ్యం.. నా విధానాలు నచ్చితే నాతో నడవండి.. నచ్చకుంటే వెళ్లిపోండని నిర్మోహమాటంగా చెప్పారు.