Pawan Chandrababu : చంద్రబాబు, పవన్‌లు ఒకరిపై ఒకరు....!
పవన్‌పై చంద్రబాబు అవాజ్యమైన ప్రేమను కురిపిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైన(Nara chandrababu) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) అపారమైన భక్తి ప్రపత్తులను చాటుకుంటుంటే, పవన్‌పై చంద్రబాబు అవాజ్యమైన ప్రేమను కురిపిస్తున్నారు. ఇద్దరికి ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ కూటమికి పగుళ్లు రాకుండా చూసుకుంటున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ ఎప్పటిలాగే చంద్రబాబుకు భుజకీర్తులు తొడిగారు. చంద్రబాబుకు భయమన్నదే లేదని, ప్రత్యర్థులు ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడకుండా ముందుకు సాగారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా తాను వస్తే తనను కూడా ఇబ్బంది పెట్టారని పవన్ తెలిపారు. అన్నటికంటే ప్రధానమైన అంశమేమిటంటే చంద్రబాబును జైలులో ఉంచినప్పుడు పవన్ కల్యాణ్ షూటింగ్ కూడా చేయలేకపోయారట! ఇది కూడా ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబుపై పవన్ ప్రశంసలు కురిపించడానికి కొన్ని గంటల ముందు చంద్రబాబు కూడా పవన్‌ను ఆకాశానికెత్తేశారు. కూటమి విజయంలో పవన్ కీలకపాత్ర పోషించారని అన్నారు. మొదటిసారి మంత్రి పదవి చేపట్టినప్పటికీ ఎంతో అనుభవం కలిగిన వ్యక్తిగా పని చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 13 వేలకుపైగా గ్రామసభలను నిర్వహించి ప్రపంచ రికార్డును సాధించారని కితాబిచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే తపన ఆయనలో కనిపిస్తున్నదని పవన్ గురించి చంద్రబాబు అన్నారు. మొత్తం మీద ఇద్దరూ పరస్పరం బాగానే పొగుడుకుంటున్నారు.