Black Magic On Village : నిమ్మకాయలు, పసుపు-కుంకుమలు.. రోడ్డుమీద చిల్లర నాణేలు, అన్నం మెతుకులు! ఏం జరుగుతోందక్కడ?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పల్నాడు(palnadu) జిల్లా తురకపాలెం గ్రామంలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పల్నాడు(palnadu) జిల్లా తురకపాలెం గ్రామంలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు. ఏం జరుగుతున్నదో తెలియక అల్లాడిపోతున్నారు. చీకటిపడిదంటే చాలు గజగజలాడుతున్నారు. రెప్పవాల్చకుండా జాగారం చేస్తున్నారు. కారణం తమ ఊరికి చేతబడి(Black magic) జరుగుతున్నదనే భయం. ఈ భయానికి కారణం ఊళ్లో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాలు(bewitched lemons) వేలాడుతుండటం, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చిల్లర నాణేలు(coins), అన్నం వెదజల్లి ఉండటం. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం చిన్న తురకపాలెంలో ఉదయం నిద్రలేవగానే ఇదే దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. 15 రోజుల కిందట ఓ వ్యక్తి ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి ఉండటాన్ని చూశారు. మరుసటి రోజున చెట్టుకు అలాగే మేకులు కొట్టి ఉన్నాయి. మొదట వీటిని ఊళ్లోవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. తుంటరివెధవెవడో ఇలా చేసి ఉంటాడని అనుకున్నారు. అయితే ప్రతీ రోజూ ఇదే జరుగుతోంది. మొదట మేకులు మాత్రమే కనిపించాయి. తర్వాత నిమ్మకాయలు, పసుపు-కుంకుమలు కనిపించసాగాయి. రాత్రిళ్లు ఎవరో నిమ్మకాయలు పెడుతున్నారు. రోడ్డుపై డబ్బులు, అన్నం వెదజల్లి వెళుతున్నారు. అప్పట్నుంచి ఊరివారికి భయం మొదలయ్యింది. ఎవరో పనిగట్టుకుని ఊరికి చేతబడి చేస్తున్నారనే అనుమానం కలిగింది. రాత్రుళ్లు ఎవరూ నిద్రపోవడం లేదు. పొద్దుపొడవగానే తమ గోడలను తనఖీ చేసుకుంటున్నారు. ఊళ్లోని యువకులు కర్రలతో కాపలా కాస్తున్నారు. ఇతరులు ఎవరూ తమ గల్లీలోకి రాకుడా ముళ్ల కంచెలు వేస్తున్నారు. పక్షం రోజులుగా క్షుద్రపూజలు జరుగుతున్నట్టు ఆనవాళ్లు కనిపించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.