15 ఏళ్ల బాలుడు, మరో 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నామని అనుకున్నారు

ఏది లవ్.. ఏది అట్రాక్షన్ అనే తేడాలు తెలియని వయసు అది. 15 సంవత్సరాలలోనే ఇద్దరూ ఇష్టపడ్డామని అనుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తీరా పోలీసులు రావడం.. నచ్చజెప్పడంతో పరిస్థితి కాస్త కుదుటపడింది.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంకు చెందిన 15 ఏళ్ల బాలుడు, మరో 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నామని అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంట్లో చెప్పకుండా పారిపోయి రాజమండ్రి నుంచి ఒంగోలు వరకు బస్సులో వచ్చారు. వారి దగ్గర ఉన్న డబ్బులు ఒంగోలు వరకే సరిపోయాయి. తిరుపతి వెళదామని అనుకుని ఒంగోలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కుదరకపోతే ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని ఒంగోలు రైల్వే స్టేషన్‌‌‌లో కూర్చుని ఉన్నారు. ఒంగోలు రైల్వే పోలీసులు స్టేషన్‌లో సోదాలు చేస్తున్న క్రమంలో రైల్వే సీఐ శ్రీకాంత్‌బాబుకు వీరిద్దరిపై అనుమానం వచ్చింది.. దగ్గరకు పిలిచి వారిని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. మైనారిటీ తీరని వయసులో పెళ్లి సరికాదని.. అసలు చెల్లదని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి అనేవి సరికాదని, మనసు మార్చుకోవాలని వారికి వివరంగా చెప్పారు. వెంటనే ఇద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే వీరిద్దరు కనిపించడం లేదని ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌‌కు కూడా ఒంగోలు పోలీసులు సమాచారం ఇచ్చారు. వీరిద్దరిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో వీరిని గుర్తించి తమకు సురక్షితంగా అప్పగించిన రైల్వే సిఐ శ్రీకాంత్‌కు, రైల్వే పోలీసులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Updated On 21 Feb 2024 11:52 PM GMT
Yagnik

Yagnik

Next Story