TTD Laddu Facts : తిరుమల లడ్డూ వివాదంలో ఇదీ వాస్తవం! ఇక అసత్య ప్రచారాలు ఆపేయండి!
తిరుమల లడ్డూ(Trumala laddu) ప్రసాదంపై రాజకీయపార్టీలు(Political parties) జరుపుతున్న వికృత విన్యాసాలను చూసి ఆ వేంకటేశ్వరస్వామి కూడా విరక్తి చెంది ఉంటాడేమో!
తిరుమల లడ్డూ(Trumala laddu) ప్రసాదంపై రాజకీయపార్టీలు(Political parties) జరుపుతున్న వికృత విన్యాసాలను చూసి ఆ వేంకటేశ్వరస్వామి కూడా విరక్తి చెంది ఉంటాడేమో! ఇలాంటి వారు తన భక్తులను చెప్పుకోవడం చూసి కలత చెంది ఉంటాడేమో! లడ్డూ వ్యవహారంలో మైలేజ్ పొందడానికి, అవతలి పార్టీపై బురద జల్లడానికి పార్టీలు చేస్తున్న ఫీట్లు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అసలు లడ్డూలో వాడిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సాక్షాత్తూ టీటీడీ ఈవోనే చెబుతుంటే(TTD EO), ఏదో మహాపరాధం జరిగిపోయినట్టు కలరింగ్ ఇస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలని, సనాతనధర్మమని, హిందూ మతమని చెబుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గుడి మెట్లు కడిగిన తర్వాత ఆవేశంతో ఊగిపోయి అరగంటపాటు ఆవేశంగా మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం ఏం చెప్పదల్చుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. హిందుత్వను భుజాన వేసుకుని బీజేపీ కంటే తానే ఎక్కువ అని చెప్పదల్చుకున్నారేమో! మంచిదే, హిందువుల మేలు కోరడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామమే! కానీ ఆయన ఇంతకు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలు మర్చిపోలేదు. వారి జ్ఞాపకశక్తి మీద అనుమానాలు పెట్టుకోకూడదు.
తల్లిదండ్రులు పూజలు చేసి దేవుడికి దీపం పెడితే, ఆ దీపంతోనే సిగరెట్ వెలిగించుకున్నానని పవన్(Pawan kalyan) చెప్పిన మాటను ఎవరు మాత్రం మర్చిపోతారు? ఇక ఆయన అన్నగారు నాగబాబు(Nagababu) కూడా ఈ మధ్యన హిందుధర్మంపై చాలా మాట్లాడుతున్నారు. తాను దేవుడిని నమ్మనని, దేవుడు అనేది రాంగ్ కాస్సెప్ట్ అని ఆయన అనలేదా? తాను బాప్టిజం(Baptism) తీసుకున్నానని, ఇజ్రాయెల్‌కు వెళ్లి క్రీస్తు పుట్టిన చోటును సందర్శించానని, క్రిస్టియన్ మతం చాలా గొప్పదని, వారిలో సేవా తత్పరత చాలా ఉంటుందని, తన ఇద్దరు పిల్లలు క్రిస్టియన్‌లేనని పవన్ కల్యాణ్ చెప్పలేదా? హిందువులే మతలాను రెచ్చగొడుతున్నారని, తనకు కుల మతాలు లేనే లేవని అనలేదా? ఇప్పుడేమో తిరుమల లడ్డూలో కలపని కల్తీ నెయ్యి కోసం హిందువులంతా బయటకు రావాలంటూ గొంతు చించుకోవడం ఏమిటి? చిత్రంగా అనిపించడం లేదు. ఇక మంత్రి నారా లోకేశ్(Nara lokesh) గతంలో ఏమేమీ చెప్పారో ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఇప్పుడెన్ని అబద్ధాలు ఆడుతున్నారో తెలిసిపోతంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనేది ఇండిపెండెంట్ సంస్థ అని, దీనికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని, అంతా ఈవో కనుసన్నల్లోనే ఉంటుందని ప్రజలకు చెప్పలేదా? (తాను అనలేదని అంటారేమో...ఇందుకు వీడియో సాక్ష్యం ఉంది) .
అసలు వాస్తవాలను ఒక్కసారి చూద్దాం.. స్పెషల్ గ్రేడ్ ఆగ్‌మార్క్ ఆవు నెయ్యి కోసం 2024 మార్చి 12వ తేదీన టీటీడీ ఈ-టెండర్లు పిలిచింది. అయితే ఎన్నికల సంఘం మార్చి 16వ తేదన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అంటే అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదని విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను. ఇకపోతే ఈ-టెండర్లు మే 8, 2024న ఖరారు అయ్యాయి. కిలో 320 రూపాయల చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తేదీ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాను ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రారంభించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కిలో కాదు కదా, కనీస గ్రాము నెయ్యిని కూడా ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేయలేదని స్పష్టం అవుతున్నది కదా! చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో ఒక్కో ట్యాంకర్ నుంచి 3 శాంపిళ్లను తీసుకుని తిరుమలలోని టీటీడీ ల్యాబోరేటరీకి
టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు పంపారు. టెండర్‌లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందని తేల్చడంతో ఆ 4 ట్యాంకర్లను టీటీడీ అధికారులు గోదాములోకి అనుమతించి
నెయ్యిని ఆన్‌లోడ్ చేసుకున్నారు.
ఈ క్రమంలో జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న 2 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపింది. ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను పరీక్షించిన టీటీడీ ల్యాబోరేటరీ టెండర్‌లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. అంటే.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడలేదు. ఈ విధంగా ప్రతి సారి నెయ్యి తదితర పదార్ధాలను టీటీడీ ల్యాబోరేటరీ టెస్ట్ చేస్తుంది. ఈ విధంగా చంద్రబాబునాయుడు హయాంలో 14 సార్లు, జగన్మోహన్‌రెడ్డి పాలనలో 18 సార్లు నెయ్యి ప్రమాణాల ప్రకారం లేదని తేలడంతో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కి పంపారు. మరి కల్తీ నెయ్యిని లడ్డూలలో ఎక్కడ వాడారు ముఖ్యమంత్రి చంద్రబాబుగారు? వేలకొద్ది పుస్తకాలు చదివి, అపార జ్ఞానాన్ని ఆర్జించిన పవన్ కల్యాణ్‌గారు దీనికి మీ సమాధానమేమిటి? అయినా :పక్కన తమిళనాడు మైసూర్ లో ఉన్న ల్యాబ్ లకు శాంపిల్ పంపకుండా ఎక్కడో గుజరాత్ లో ఉన్న NDDB ల్యాబ్ కి శాంపిల్ పంపడమేమిటి? NDDB రిపోర్ట్ జూలై 23న వస్తే 2 నెలల తరువాత 100 రోజుల బాబు ఘోరమైన పాలన అప్ప్పుడు బయటపెట్టడం ఏమిటి? ఈ సందేహాలు ప్రజలకు రాకుండా ఉంటాయా? ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ అదే నిజమని ప్రజలు నమ్మేలా చేయడంలో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా తెగ ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి ఆ మీడియా సంస్థలు చేస్తున్నది ఇదే కదా! ప్రజల మనసులను కలుషితం చేస్తూ, వారి భావోద్వేగాలతో ఆటలాడుకోవడం భావ్యమేనా ? కేంద్ర సంస్థలతో విచారణ జరపడానికి భయమెందుకు చంద్రబాబు? మీరు సిట్ అంటే కూర్చొని, స్టాండ్ అంటే నిలబడే సిట్‌తో విచారణ జరపడమేమిటి? అది ఏం చెబుతుందో అందరికీ తెలుసు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. జరిగిందేదో జరిగింది. వేంకటేశ్వరస్వామి సాక్షిగా వాస్తవాలు చెపితే తెలుగు ప్రజలకే కాదు, దేశంలోని సమస్త హిందువులకు మేలు చేసిన వారు అవుతారు! ఇక మీ ఇష్టం!