అదృష్టం పదే పదే తలుపుతట్టనట్టే రాజకీయ నాయకులకు అవకాశాలు పదే పదే రావు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడే విజేతగా నిలుస్తాడు. అందుకు కావాల్సింది పోరాటపటిమ. అకుంఠిత దీక్ష. మొక్కవోని ఆత్మవిశ్వాసం. చెక్కు చెదరని ధైర్యం. ఈ లక్షణాలు తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లో(Nara Lokesh) లోపించాయి.

అదృష్టం పదే పదే తలుపుతట్టనట్టే రాజకీయ నాయకులకు అవకాశాలు పదే పదే రావు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడే విజేతగా నిలుస్తాడు. అందుకు కావాల్సింది పోరాటపటిమ. అకుంఠిత దీక్ష. మొక్కవోని ఆత్మవిశ్వాసం. చెక్కు చెదరని ధైర్యం. ఈ లక్షణాలు తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లో(Nara Lokesh) లోపించాయి. ఈ మాట ఎందుకనాల్సి వస్తున్నదంటే తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు అలాగే ఉంది. మనమోసారి పుష్కరకాలం ముందుకెళదాం.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత వైఎస్‌ జగన్‌(YS Jagan) ఒంటరివాడయ్యారు. పరిస్థితులేవీ తనకు అనుకూలంగా లేవు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌(Congress) నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది.
సువర్ణావకాశాన్ని జారవిడుచుకున్న లోకేశ్‌

ఒక్కసారిగా జగన్‌పై కేసులు వచ్చిపడ్డాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ జగన్‌వైపు నిలబడలేదు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ కూడా జగన్మోహన్‌రెడ్డి రాజకీయ పతనాన్ని ఆకాంక్షించింది. కాంగ్రెస్‌ అధినాయత్వంపై ధిక్కార స్వరం వినిపించినందుకు జగన్‌ అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయారు. తన కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మొర ఆలకించేవారే లేరు. అప్పుడాయన వయసు నాలుగు పదులలోపే! అయినా జగన్ ఏటికి ఎదురీదారు. తన వ్యతిరేక శక్తులపై నిరాంటకంగా పోరాటం సాగించారు. అలుపన్నది లేకుండా శ్రమించారు. చివరకు విజేత అయ్యారు. ఇప్పుడు లోకేశ్‌ వయసు కూడా దాదాపు 40 ఏళ్లు.

తెలుగుదేశం పార్టీలో రెండో స్థానంలో ఉన్నారిప్పుడు. తన తండ్రిని, ముఖ్యమంత్రి పదవిలో సుమారు 14 ఏళ్ల పాటు ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేస్తే ఒక్కసారిగా డీలా పడిపోయారు. తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకునే సందర్భాన్ని జారవిడుచుకున్నాడు. తనలోని నాయకత్వ లక్షణాలను చాటిచెప్పుకునే సమయాన్ని వృధాగా పోనిచ్చాడు. ప్రజల స్పందన కానీ, పార్టీ కార్యకర్తల ప్రతిఘటన కానీ రాకపోవడానికి పరోక్షంగా లోకేశ్‌ వ్యవహారశైలినే కారణం.

పార్టీలో నంబర్‌ టూ స్థానంలో ఉన్న లోకేశ్‌ ఢిల్లీ వెళ్లి కూర్చుని పార్టీ క్యాడర్‌కు రాంగ్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మాట టీడీపీ సానుభూతి పరుల నుంచే వచ్చింది. జాతీయ నాయకులతో ముచ్చటించడానికి వెళ్లారనీ, జాతీయ మీడియాలో రాజకీయ కక్షతోనే తన తండ్రిని అరెస్ట్‌ చేశారని చెప్పడానికి వెళ్లారనీ కొందరు లోకేశ్‌కు వత్తాసు పలికితే పలకవచ్చుగాక! ఈ మాట చెబితే ఎవరూ నమ్మరు.

లండన్‌లో ఉంటూ లాయర్‌ హరీశ్‌ సాల్వే కోర్టులో కేసు వాదించినప్పుడు రాజమండ్రిలో ఉంటూ లోకేశ్‌ నేషనల్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేరా అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది. కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్‌ కోసమే అయితే అన్ని రోజులు అక్కడే ఉండాల్సిన అవసరం ఏముంటుంది. టీడీపీ లాబీయిస్టులు ఢిల్లీలో చాలా మందే ఉన్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం వారు ప్రయత్నించవచ్చు. దొరికితే ఒక్క రోజులో ఢిల్లీకి వెళ్లి రావచ్చు. ఆ మాత్రందానికి నెల రోజులుగా లోకేశ్‌ ఢిల్లీలోనే ఉన్నారు.

ఇక్కడి పార్టీ పరిస్థితులను ఏ మాత్రం పట్టించుకోలేదు. లోకేశే ఇక్కడ లేనప్పుడు పార్టీ క్యాడర్‌ మాత్రం రోడ్డు మీదకు ఎందుకు వస్తుంది? సీనియర్‌ నాయకులు అశోక్‌ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, అచ్చన్నాయుడు వీరెవ్వరూ చురుకైన పాత్ర పోషించలేదు. లోకేశ్ రాజమండ్రిలోనే ఉంటూ సీనియర్‌ నాయకుల సహకారం తీసుకుని పోరాటం చేస్తే ప్రజలలో మంచి పేరు వచ్చేది. పోరాట నాయకుడన్న కీర్తి కూడా లభించేది. మొత్తంమీద లోకేశ్‌ ఆయాచితంగా లభించిన ఓ సువర్ణావకాశాన్ని వదిలేసుకున్నారు.

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 5:55 AM GMT
Ehatv

Ehatv

Next Story