Nandamuri Balakrishna: నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య.. ఆస్తులు ఎంతంటే?
తనకు రూ. 9 కోట్లకు పైగా అప్పులున్నాయని నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసే సమయంలో తన ఆస్తులు, అప్పుల వివరాలను బాలయ్య తెలియజేసారు. నందమూరి బాలకృష్ణ పేరిట 81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని, అదేవిధంగా 9 కోట్ల 9 లక్షల అప్పులు ఉన్నాయని తెలిపారు.
తనకు రూ. 9 కోట్లకు పైగా అప్పులున్నాయని నందమూరి బాలకృష్ణ తన అఫిడవిట్‌లో చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఆస్తుల విలువ రూ. 81.63 కోట్లు. ఆయన సతీమణి వసుంధర ఆస్తుల విలువ రూ. 140 కోట్ల 38 లక్షల 83 వేలు. వసుంధర అప్పులు రూ. 3 కోట్ల 83 లక్షల 98 వేలుగా ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని.. పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడి వారికి తమ కుటుంబం అంటే ఎంతో ఇష్టమని, ఆ అభిమానంతోనే తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను కోరారు.