Nadendla Manohar : ఏపీలో మరో కీలక పథకం రద్దు
పౌరసరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు(Chandrababu) సమీక్షా సమావేశం నిర్వహించారు.
పౌరసరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు(Chandrababu) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Monohar) కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ బియ్య పథకం(Ration door delivery scheme) రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ బియ్యం పథకం అమలును తీసుకొచ్చారు. గత ప్రభుత్వం రూ. 9,260 వాహనాలు కొనుగోలు చేసిందని నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ డోర్ టు డోర్ రేషన్ బియ్యం పంపిణీ పథకం కింద 1,844 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. గతంలో ప్రజలు రేషన్ కోసం రేషన్ దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేవారు. ఈ పథకంలో భాగంగా ఎండీయూ వాహన డ్రైవర్, సంబంధిత రేషన్ డీలర్ ఆ వాహనంలో రేషన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్ అందించేవారు. అయితే ఎండీయూ వాహనాలు కూడా వైసీపీ కార్యకర్తలకే దక్కాయనే ఆరోపణలు అప్పుడు వచ్చాయి. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.