తనను పదేళ్ల పాటు వాడుకొని బలిపశువును చేశారని.. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏమిటని జడ్జి అడుగుతారని

తెలుగుదేశం పార్టీని పలువురు నాయకులు వరుసగా వీడుతూ ఉన్నారు. తాజాగా ఆ లిస్టులోకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చేరారు. తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ నూజివీడు నియోజక వర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. నూజి వీడులోని తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని వెంకటేశ్వరరావు స్వయంగా తొలగించారు.

టీడీపీ కోసం ఎంతో చేశానని.. అయినా కూడా తనను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటూ పార్టీ కోసం పని చేశానని అన్నారు. నియోజకవర్గంలో పదేళ్ల పాటు పనిచేసి టీడీపీని పటిష్టంగా తయారు చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు తాను పనికిరాలేదని వాపోయారు. 2014లో ఎవరూ లేకపోవడంతో తాను అడగకుండానే యనమల రామకృష్ణుడితో కబురు చేసి నూజివీడు టికెట్‌ ఇచ్చారని, ఇప్పుడు టికెట్‌ నిరాకరించడంపై కారణమేమిటో అడుగుతుంటే చంద్రబాబు దగ్గర సమాధానమే లేదని అన్నారు. తనను పదేళ్ల పాటు వాడుకొని బలిపశువును చేశారని.. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏమిటని జడ్జి అడుగుతారని, టీడీపీలో మాత్రం అలాంటి నైతిక విలువలు ఏమీ లేవని అన్నారు. తన అభిమానులు, సానుభూతిపరులు, కలిసివచ్చే కార్యకర్తలు, నాయకులతో చర్చించి వారి నిర్ణయం మేరకు త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. తనను పదేళ్లపాటు వాడుకొని అన్యాయంగా బయటకు గెంటివేసిన వారి అంతు చూస్తానని ఆయన స్పష్టం చేశారు.

Updated On 20 Feb 2024 11:25 PM GMT
Yagnik

Yagnik

Next Story