Kodali Nani : చంద్రబాబు, కూటమిని బంగాళాఖాతంలో కలపవల్సిన సమయం వచ్చింది
ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలంలోని చంద్రాల, సింగలూరు, విన్నకోట గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలంలోని చంద్రాల, సింగలూరు, విన్నకోట గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజానీకం గజ మాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. సెంటర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు.. స్థానికులతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి.. ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ.. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు రాకముందే వాలంటీర్లను తీసేశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు, కూటమిని బంగాళాఖాతంలో కలపవల్సిన సమయం వచ్చిందని అన్నారు. అందరం సమాయత్తమై చంద్రబాబు దొంగ మాటలు నమ్మవద్దని సూచించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా మంచి పని చేశారా అని కొడాలి నాని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు ఇలాంటి రకరకాల మాయమాటలు చెప్తున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలని కొడాలి నాని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. నిరంతరం మీకు అండగా ఉంటున్న సీఎం జగనన్నకు ఈ ఎన్నికల్లో ఓటెయ్యాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.