Jaleel Khan: టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్.. జంప్ చేస్తారా?
వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిశారు. జలీల్ ఖాన్ విజయవాడలోని అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో భేటీ అయ్యారు
టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్ కు ఈసారి టీడీపీ టికెట్ ఇచ్చేది కష్టమేనని అంటున్నారు. ఇంతలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం ఆయన వైసీపీ నేతలతో మంతనాలు జరిపారనే వార్త విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ నేత కేశినేని చిన్నిని టీడీపీ హైకమాండ్ రంగంలోకి దించిందని.. ఆయన నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్ ఖాన్ నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుతానికైతే రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ని జలీల్ ఖాన్ కలవబోతున్నారు.
జలీల్‌ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవలే బల ప్రదర్శన కూడా చేశారు. ఆ సీటును టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా బేగ్ కూడా ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ సీటు జనసేన పార్టీకి కేటాయించడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ క్రమంలో జలీల్‌ఖాన్ వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారనే వార్త వైరల్ గా మారింది. జలీల్ ఖాన్ బుధవారం ఉదయం వైఎస్సార్‌సీపీ నేతలతో మంతనాలు మొదలు పెట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిశారు. జలీల్ ఖాన్ విజయవాడలోని అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమైందనే వార్తలొచ్చాయి. సాయంత్రం జలీల్ ఖాన్ ను కేశినేని చిన్ని సముదాయించినట్లు తెలుస్తోంది. జలీల్‌ఖాన్ 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో.. పార్టీ మారారు. 2019 ఎన్నికల్లో జలీల్‌ఖాన్ బదులు ఆమె కూతురు పోటీచేసి ఓడిపోయారు.