Andhra Pradesh : చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు.
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్లు మంత్రి చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుచేసే విషయంపై చర్చించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధంగా ఉందన్నారు. మొదటగా రూ. 50 వేల నుండి 75 వేల కోట్లు పెట్టుబడులు పెడతారని.. ఆ తర్వాత రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఇందుకోసం మూడు ప్రాంతాలను పరిశీలిస్తారన్నారు. 90 రోజుల తర్వాత మళ్లీ సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధులు సమావేశమవుతారన్నారు. అప్పుడు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటుచేసేది నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు, బీపీసీఎల్ ప్రతినిధుల సమావేశం ఎంతో ఉత్సాహంగా సాగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులకు విందు ఇచ్చారన్నారు.