Minister Savitha : రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెస్తాం
రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కృషిచేస్తోందని గౌరవ రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు
రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కృషిచేస్తోందని గౌరవ రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మేరీస్ స్టెల్లా కాలేజీ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పలువురు అధికారులతో కలిసి చేనేత వాకథాన్‌ను ప్రారంభించారు. చేనేత వస్త్రాలు ధరిద్దాం.. చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పోగును వస్త్రంగా తయారుచేసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేత కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాం చేనేతకు స్వర్ణయుగమని.. నేత కార్మికులకు రాజయోగమేనన్నారు. చేనేత కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని.. వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన నేతన్నలకు పూర్తి ఆసరాగా నిలిచారన్నారు. వారికి సుస్థిర జీవనోపాధికి వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలుచేశారన్నారు. అయితే గత కొన్నేళ్లలో నేతన్నలకు సరైన ఆదాయం లేక, వారి ఉత్పత్తులు కొనేవారు లేక వలసపోయే పరిస్థితి వచ్చిందని.. ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయన్నారు. నిర్వీర్యమైన చేనేతకు మళ్లీ పూర్వవైభవం తెస్తామని.. నేతన్నలను ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు.