రాష్ట్రంలోని వెనుక బడిన తరగతి వర్గాల చిరకాల కోర్కె అయిన సమగ్ర కులగణనకు వచ్చే నెల 15న శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వెనుక బడిన తరగతి వర్గాల చిరకాల కోర్కె అయిన సమగ్ర కులగణనకు వచ్చే నెల 15న శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ(Chellaboina Srinivas venugopala krishna) పేర్కొన్నారు. వెనుక బడిన తరగతి వర్గాలతో పాటు ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనారిటీల్లో(Minorities) అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ సమగ్ర కులగణనను(Cast Census) చేపట్టడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.

బుధవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. మన చరిత్రను ఒక సారి పరిశీలిస్తే దేశంలో 1872లో కులగణన ప్రక్రియ ప్రారంభమై 1901 నాటికి ఒక స్థాయికి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో కలిపి అప్పటి భారత దేశ జనాభా 30 కోట్లు ఉండేదని, అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోయినప్పటికీ ప్రస్తుత మన దేశ జనాభా నేటికి 140 కోట్లకు చేరుకుందన్నారు. అదే విధంగా 1901 నుండి 1941 వరకూ ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి కులగణన జరిగిందన్నారు. అయితే 1941 లో రెండో ప్రపంచ యుద్దం మరియు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నేపథ్యంలో 1941 సంవత్సరంలోని కులగణను పరిగణలోకి తీసుకోక పోవడం వల్ల 1931 జరిగిన కులగణననే చివరి కులగణన అని ఆయన తెలిపారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి 1951 నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన మాత్రమే నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ జనగణనలో ఎస్సీ, ఎస్టీ జనాభాను తప్ప మిగిలిన అన్ని కులాలను గంపగుత్తగా లెక్కించడం జరుగుచున్నదన్నారు. ఫలితంగా బి.సి. వర్గానికి చెందిన పలు కులాల ప్రజలు ఎంతగానో నష్టపోవడం జరుగుతుంద‌న్నారు. బి.సి. వర్గంలో ఎన్నో వెనుక బడి కులాలు ఉన్నాయని, ఆ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు పర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కులగణన జరిపించాలనే డిమాండు ఎప్పటి నుండో ఉందని, రాష్ట్రంలో బి.సి. వర్గాలకు చెందిన పలువురు నాయకులు, ప్రజలు ఎన్నో విజ్ఞాపనలు, వినతులు ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఈ డిమాండును ఏమాత్రము పట్టించుకోకుండా బి.సి.వర్గాలను నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ బి.సి. వర్గాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వడమే కాకుండా పది మంది బి.సి.లకు మంత్రుల పదవులను కూడా కట్టబెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 139 బి.సి.కులాలను గుర్తించి కులాల వారీగా కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా నవరత్నాల పథకాలను పెద్ద ఎత్తున ఆయాకులాల వారికి అందజేయడం జరుగుతుంద‌న్నారు.

అదే విధంగా బి.సి.ల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా పథకాలను రూపొందించి అమలు పర్చాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 11 న మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో కులగణన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ప్రతి పదేళ్లకు ఒక సారి జరిగే జనగణనతో పాటు సమగ్ర కులగణనను కూడా రాష్ట్రంలో జరిపించాలని గత బడ్జెట్ సమావేశాల్లో శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. అయితే ఇప్పటి వరకూ కేంద్రం నుండి ఎటు వంటి సమాదానం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేయించాలని గత శాసన సభా సమావేశాల్లో తీర్మానించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులతో ఇప్పటికే ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో రాష్ట్రంలో కులగణనను వచ్చే నెల 15 నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated On 18 Oct 2023 8:06 AM GMT
Ehatv

Ehatv

Next Story