ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకుల మధ్య స్పష్టమైన విభేదాలు కాన‌వ‌స్తున్నాయి. ఎందుకంటే.. మంగళవారం పార్టీ హైకమాండ్‌తో సమావేశానికి కీలక సీనియర్ నాయకులు హాజరుకాకపోవడంతో విభేదాలు స్పష్టంగా బ‌య‌ట‌కు క‌నిపించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకుల మధ్య స్పష్టమైన విభేదాలు కాన‌వ‌స్తున్నాయి. ఎందుకంటే.. మంగళవారం పార్టీ హైకమాండ్‌తో సమావేశానికి కీలక సీనియర్ నాయకులు హాజరుకాకపోవడంతో విభేదాలు స్పష్టంగా బ‌య‌ట‌కు క‌నిపించాయి. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ పొందిన అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ కేంద్ర నాయకులు సిద్ధార్థనాథ్‌ సింగ్‌, అరుణ్‌సింగ్‌ పాల్గొన్నారు.

అయితే ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ సహా రాష్ట్ర సీనియర్ నేతలు హాజరుకాలేదు. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్నప్పటికీ తమను పక్కన పెట్టారని, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి లోక్‌సభ టిక్కెట్లు ఇచ్చారని వారు ఈ స‌మావేశానికి డుమ్మా కొట్టార‌నే వాద‌న విన‌వ‌స్తోంది.

నర్సాపురం నుంచి పోటీ చేయనున్న శ్రీనివాస్‌వర్మ మినహా మిగిలిన ఎంపీ అభ్యర్థులైన పురంధేశ్వరి, సీఎం రమేష్, కిరణ్‌కుమార్‌రెడ్డి, కొత్తపల్లి గీత, వరప్రసాద్‌లు ఇతర పార్టీల నుంచి జంప్ అయ్యి వ‌చ్చారు. ఇది ఇతర సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు.

సత్యకుమార్‌ను ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి, సోము వీర్రాజును అనపర్తి నుంచి పోటీ చేయించాల‌ని పార్టీ హైకమాండ్ భావిస్తున్నప్పటికీ ఆ స్థానాల నుంచి పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపుతున్నారు. సోము వీర్రాజును పోటీకి దింపేందుకు రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని బీజేపీ తన కూటమి భాగస్వామి టీడీపీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అయితే.. సోము వీర్రాజు అస్వస్థతతో మంగళవారం సమావేశానికి హాజరుకాలేదని బీజేపీ నేతలు చెబుతుండగా.. మరో ముగ్గురు సీనియర్ నేతలు ఎందుకు రాలేదో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

కాగా, మంగళవారం జరిగిన‌ సమావేశంలో బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చెర్ల 10 అసెంబ్లీ స్థానాల్లో ఈ తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఒక స్థానం అనపర్తి నియోజకవర్గం కాకుండా రాజమండ్రి అర్బన్ లేదా రూరల్ అసెంబ్లీని టికెట్‌ను ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించే అవకాశం ఉంది.

రాజులను (క్షత్రియులు) నామినేట్ చేయడం ద్వారా దాదాపు లక్ష క్షత్రియ సామాజికవర్గ ఓట్లను ప్రభావితం చేయవచ్చని ఆ పార్టీ భావిస్తున్నందున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కూడా బీజేపీ పోటీ చేయాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అక్కడి నుంచి టీడీపీ నుంచి జగన్మోహన్‌రాజు, బీజేపీ నుంచి చెంగల్‌రాజులకు టిక్కెట్‌ దక్కే అవకాశం ఉంది.

Updated On 26 March 2024 10:09 PM GMT
Yagnik

Yagnik

Next Story