Alla Ramakrishna Reddy : మంగళగిరిలో సంచలనం సృష్టించేందుకు ప్రజలు వేచి చూస్తున్నారు
2024లో అవినీతి లేని ప్రశాంతతతో కూడుకున్న మంగళగిరినే ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..
2024లో అవినీతి లేని ప్రశాంతతతో కూడుకున్న మంగళగిరినే ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు లేని పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించిందన్నారు. విజయరేఖ లేని లోకేష్ ధన దాహంతో చేస్తున్న ప్రయత్నాలన్నింటిని తిప్పికొట్టడానికి నియోజకవర్గ ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.
2014 - 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు కూడా జగన్ కు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖున జరుగనుండగా.. నియోజకవర్గంలో ఒక సంచలనాన్ని సృష్టించేందుకు ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు.
మహాత్మ జ్యోతిబాపూలే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో.. పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలన్న దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికార దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమైన బీసీ మహిళకు మంగళగిరి నియోజకవర్గ సీటు కేటాయింపు పట్ల నియోజవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్దే తిరిగి పోటీ చేస్తుండటం.. అతను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేక.. ఇప్పుడు భవిష్యత్తులో ఏదో చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్న నారా లోకేష్ ను నియోజవర్గ ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి వచ్చిన మెజార్టీ కంటే రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ భారీ మెజారిటీ అందించబోతున్నారు అంటూ జోస్యం చెప్పారు.
కుల మత పార్టీ ప్రాంత భేదాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత దేశంలో ఒక్క జగన్ కే దక్కుతుందని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే దమ్ము ప్రజాస్వామ్యంలో జగన్‌కి ఒక్కరికే ఉందన్న విషయం స్పష్టమవుతుందన్నారు.
2014 - 19 మధ్య ఇదే నియోజకవర్గంలో నివసించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మూడు శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ఏ ఒక్కరోజైనా నియోజవర్గంలో పర్యటించారా అంటూ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేక, మళ్లీ అధికారం ఇస్తే ఏదో చేస్తాం అంటున్న తండ్రి కొడుకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
ధన దాహంతో , డబ్బు సంచులతో ఓట్ల కొనుగోలు కోసం వస్తున్న తెలుగుదేశం పార్టీ మోసపూరిత వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా చేస్తానంటూ మోసం చేస్తే, తానేమి తక్కువ తినలేదు అంటూ ఆయన కొడుకు గచ్చిబౌలి చేస్తాను అనడం నియోజకవర్గం ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ ఐదు సంవత్సరాల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలుసని.. నియోజవర్గంలో ఈ పది సంవత్సరాల కాలంలో కబ్జాలు సెటిల్మెంట్లు దందాలు లేని ప్రశాంతతతో కూడిన పరిపాలనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించిందని.. రానున్న రోజుల్లో కూడా అవినీతి లంచాలు లేని పాలననే ప్రజలకు కోరుకుంటున్నారని, అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.