Minister Ramprasad Reddy : త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం
రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో రహదారుల స్థితిగతులను మెరుగు పర్చడంతో పాటు ఆర్టీసి డ్రైవర్లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఉదయం 11.00 గంటల సమయంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో రాష్ట్ర రవాణా, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు.
అనంతరం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత నిస్తామని, ప్రభుత్వం మరియు ఆర్టీసి పరంగా అందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరలోనే చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని, దు:ఖాన్ని తాను 11 ఏళ్ల వయస్సులోనే స్వయంగా అనుభవించానని, రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోవడం జరిగిందనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. అటు వంటి నష్టం, దు:ఖం మరెవ్వరికీ కలుగకుండా ఉండేందుకై అవసరమైన అన్ని చర్యలను త్వరలో తాను చేపడతానని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతులు అస్తవ్యస్తంగా మారాయని, రోడ్ల స్థితిగతులను మెరుగుపర్చే అంశంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఏపీఎస్ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ సరైన క్రీడాకారులు లేక ఎంతో వెనుబడిపోయి ఉన్నామని, యువతలో క్రీడా స్పూర్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మానసిక ఉల్లాసాన్ని శారీరక దారుడ్యాన్ని పెంపొందించే క్రీడలు యువతకు ఎంతో అవసరమన్నారు. అటు వంటి క్రీడలను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించే విధంగా మరియు యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో యువజనులను ప్రోత్సహించే విధంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా యువజన సర్వీసుల శాఖను నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. అటు వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా యువతను, నిరుద్యోగులను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలను చేపడతామన్నారు.
ఈ సందర్బంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాదానం చెపుతూ గత ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయకుండా నిర్వీర్యం చేసిందని, నూతన బస్సులను కొనుగోలు చేయకపోవడమే కాకుండా, మరామ్మత్తులకు గురైన బస్సులను కూడా రిపేరు చేయించకుండా వదిలేసిందన్నారు. కోట్లాది రూపాయలు విలుచేసే ఆర్టీసీ ఆస్తులను బిఓటి పద్దతిలో కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరిగిందన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకునేందుకు త్వరలో ఒక కమిటీ వేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.