Magunta Parvathamma Passed Away : మాగుంట కుటుంబంలో విషాదం
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి మరణం తర్వాత మాగుంట పార్వతమ్మ ఆరోగ్యం దెబ్బతింది. ఆమెను ఇటీవల చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పార్మతమ్మకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారు. ఈ ఉదయం ఆమె కన్నుమూశారు. గురువారం నెల్లూరులో పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించింది. మాగుంట పార్వతమ్మ 19 ఫిబ్రవరి 1967న మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామ రెడ్డిని వివాహం చేసుకుంది. 1995లో ఆయన మరణాంతరం.. 1996లో ఆమె ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 50,060 ఓట్ల మెజారిటీతో గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైంది. ఆ తర్వాత 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైంది. ఆ తర్వాత 2012లో ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు.