Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు. హైదరాబాద్‌లో పిన్నెల్లి కోసం తెలంగాణ పోలీసులతో కలిసి ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. అయితే అక్కడ ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ అన్నారు. ఈ ఘటనపై ఎంత వరకైనా వెళతామన్నారు. మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవమని.. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. అన్ని వీడియోలు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూత్‌లలో కెమెరాలు పెట్టిందే అన్నీ తెలుసుకోవడానికి అన్నారు. మాచర్లలో పొరపాట్లు జరిగాయని... తాము పది రోజులుగా మొత్తుకుంటున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.