YS Jagan Attacked: టేక్ కేర్ అన్నా అంటున్న కేటీఆర్.. వైఎస్ షర్మిల ఏమని స్పందించారంటే?
సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. మేమంతా సిద్ధం సభలో ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. జగన్ సురక్షితంగా బయటపడినందుకు సంతోషమన్నారు. "మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్నా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాను." అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయ్యిందని అనుకుంటున్నామని.. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని షర్మిల అన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని.. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందేనని వైఎస్ షర్మిల అన్నారు.