Kodali Nani: కాపు సామాజికవర్గం పవన్, చంద్రబాబులకు బుద్ధి చెప్పబోతోంది: కొడాలి నాని
తెలుగుదేశం తొలిజాబితాలో 21 మంది కమ్మ సామాజికవర్గం అభ్యర్థులు ఉన్నారన్నారు కొడాలి నాని
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. పవన్ ఒళ్లుమరిచిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనంతగా ఊగిపోతూ హడావుడి చేశారన్నారు. పవన్ ను అడ్డుపెట్టుకుని జగన్ ను నీచంగా తిట్టించిన చంద్రబాబు, మేము ప్రతీగా రెచ్చిపోయి పవన్ ను తిడితే దాన్ని అడ్డుపెట్టుకుని ఆ సామాజికవర్గం ఓట్లు తమవైపు తిప్పుకునేలా కుటిల రాజకీయం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ను తొక్కడం కాదు.. పవన్ కళ్యాణ్ ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కాపు సామాజికవర్గం వారిద్దరికీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్.. సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
తెలుగుదేశం తొలిజాబితాలో 21 మంది కమ్మ సామాజికవర్గం అభ్యర్థులు ఉన్నారన్నారు కొడాలి నాని. ప్రకటించాల్సిన మిగిలిన సీట్లలో మరో 10 మందికి అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలో 3 శాతం ఓట్లు ఉన్నవారికే 30 సీట్లు ఇస్తే.. 20 శాతం ఓటర్లు ఉన్నారని పదేపదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఎన్ని సీట్లు అడగాలని నిలదీశారు. చంద్రబాబును గెలిపించేందుకు పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు చేసే కుల, కుటిల రాజకీయ ఎత్తుగడల్లో తాము చిక్కబోమని కొడాలినాని అన్నారు. పవన్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. జగన్ చేసిన మంచిపనులు, సంక్షేమ పథకాలే ఈసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని కొడాలినాని స్పష్టం చేశారు.