Kishore Chandra Dev: టీడీపీకి రాజీనామా చేసిన కీలక నేత
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో తన రాజీనామా ప్రకటన చేశారు. తాను ఐదేళ్ల క్రితం
కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. టీడీపీ బీజేపీతో పొత్తు కోసం సంప్రదింపులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో వివరించారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని.. అధికారం కోసం తన అంతరాత్మను అమ్ముకోలేనని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో తన రాజీనామా ప్రకటన చేశారు. తాను ఐదేళ్ల క్రితం టీడీపీలో చేరానని.. అప్పట్లో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు వి కిశోర్ చంద్రదేవ్. ఆ విధానాల ప్రభావం వల్లే తాను టీడీపీలో చేరానని చెప్పారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనన్నారు. ఇక స్వతంత్రంగా పోటీచేయడానికి అరకు పార్లమెంటు స్థానం అనువైనది కాదన్నారు.