వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యిందని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యిందని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ పాల‌న‌లో అన్ని వ్యవస్థలూ విధ్వంసానికి గురయ్యాయని అన్నారు. జగన్ పాలనలో బాధితులు కాని వర్గం అంటూ లేరని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేసిన ఈ దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు మూడు పార్టీలు జతకట్టడం శుభ పరిణామం అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కూట‌మి విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుందన్నారు.

రాష్ట్రాన్ని పునర్నిర్మించడమనే ఏకైక అజెండాతో మూడు పార్టీలు మహా కూటమిగా ఏర్పడటం జరిగిందని వివ‌రించారు. జగన్ చేసిన విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు చాలా అవసరమ‌న్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, అమరావతి నిర్మాణం, పోలవరం, నదుల అనుసంధానం, విభజన చట్టం హామీలు సత్వర అమలుకు కేంద్ర సహకారం అవసరమ‌న్నారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయిందని.. ఇప్పుడు బీజేపీ చేరడంతో ఈ మహా కూటమిని చూసి దుకాణం సర్దుకొని పారిపోవడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల కోసం, ప్రజల తరుపున ఏర్పడిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు.

Updated On 9 March 2024 12:47 PM GMT
Yagnik

Yagnik

Next Story