విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు.అనేక అంశాలను, వివిధ వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనించి ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని తెలిపారు. రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని కేశినేని నాని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ, విజయవాడపై తన అంకితభావం బలంగానే ఉంటుందన్నారు. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటానన్నారు. ఇప్పుడు నా జీవితంలో మరొక అధ్యాయం మొదలవుతోంది. ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నాను. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.

కేశినేని నాని ప్రకటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యంగ్యంగా స్పందించారు. "రెండుసార్లు నిన్ను పార్లమెంటుకు పంపిన చంద్రబాబును పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. రెండుసార్లు పార్లమెంటుకు పంపిన చంద్రబాబుకు కనీసం కృతజ్ఞతలైనా చెబుతావని ఆశిస్తున్నాం. అలాగే, రెండోసారి నువ్వు గెలిచినప్పటి నుంచి నీ మాటలతో ఆయనను బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాం" అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

Updated On 10 Jun 2024 11:28 PM GMT
Yagnik

Yagnik

Next Story