YCP Confusion : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో(YSRCP) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో(YSRCP) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన అయిదు నెలలపైనే అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దేశంలో జమిలీ ఎన్నికలు(Jamili elections) తథ్యమని, 2027లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్‌లో కాసింత ఉత్సాహం వచ్చింది. నాయకులు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరాశలో ఉన్న మాట వాస్తవం. చాలా చోట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిపై కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారన్నది కూడా నిజం! వైఎస్‌ఆర్ కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన చాలా మంది నాయకులు సొంత ఊళ్లను వదిలిపెట్టి కుటుంబంతో మరో చోటకు వెళ్లి జీవనం సాగిస్తున్న మాట కూడా నిజమే! ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే ఏమవుతుందోనన్న భయం వారిని వలసబాట పట్టించింది. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. అరెస్ట్‌లు చేస్తున్నారు. కొందరిని చిత్రహింసలు కూడా పెడుతున్నారు. కార్యకర్తలను ఆదుకోవడం కోసం వైఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది న్యాయవాదులను నియమించుకుంది. ఈ లాయర్ల బృందం అహర్నిశలు ఈ పని మీదనే ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలను భయం వెంటాడుతోంది. నియోజకవర్గ నాయకులెవ్వరూ కార్యకర్తల మంచి చెడులను చూడకపోవడమే దీనికి కారణం.