Pawan Kalyan Pithapuram: పిఠాపురంలో అసలు ఏమి జరుగుతోంది
జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు
జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే పిఠాపురం టీడీపీ శ్రేణులు మాత్రం అందుకు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. పిఠాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. వర్మ అనుచరులు టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. పిఠాపురం టికెట్ ఎస్వీఎస్ఎన్ వర్మకే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. "ఇప్పటివరకు పిఠాపురం ప్రజల కష్టాల్లో భాగం అయ్యాను. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేశాను. ఇన్ని చేసిన నాకు ఇది తీరని అన్యాయం. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం" అని ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ చేశారు.
పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి పోటీ చేయమని అడిగారని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని.. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభించానని తెలిపారు.