జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా మాయ’’ గుర్తుకొస్తుందని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం పెడనలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ..

జగన్(Jagan) ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా మాయ’’ గుర్తుకొస్తుందని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. వారాహి విజయయాత్ర(Varahi Vijaya Yathra)లో భాగంగా బుధవారం పెడన(Pedana)లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో నా చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా.. రూపాయి పావలా.. అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడిని. అంత పెద్ద బొమ్మలు రూపాయి పావలా అంటే ఆశ కలిగేది. ఎలాగైనా కొనాలని గోల చేస్తే అమ్మ మందలించేది. ఒకసారి ఎలాగోలా రూపాయి పావలా సంపాదించి, ఆ బొమ్మలు అమ్మే వారి దగ్గరకు వెళ్లి బొమ్మ ఇవ్వండి అంటే ఆ బొమ్మల వ్యాపారులు ఒక్కో బొమ్మకు ఒక్కో రేటు చెప్పారు. వారు వీధుల్లో గట్టిగా అరిచిన రూపాయి పావలా రేటుకు అసలు బొమ్మలే లేవు. అందరిలో ఆశ పుట్టించి, తర్వాత ఎలాగైనా ఆ బొమ్మలు కొనుగోలు చేయించాలనేది ఆ రూపాయి పావలా వ్యాపారుల స్ట్రాటజీ. ఆంధ్రప్రదేశ్ లో అచ్చంగా జరుగుతోంది ఇదేన‌ని ప‌వ‌న్ అన్నారు.

జగన్ అనే రూపాయి పావలా ముఖ్యమంత్రి తన రూపాయి పావలా ప్రభుత్వంలో నవరత్నాలు అనే మోసాన్ని బహిరంగంగా చేస్తూ, ప్రజల్ని ఏమారుస్తున్నార‌ని విమ‌ర్శించారు. జగన్ ప్రభుత్వంలో చెప్పిన నవరత్నాలన్నీ రూపాయి పావలా స్ట్రాటజీ పథకాలే అని జనం కూడా అర్ధం చేసుకున్నారు’ అని అన్నారు. ‘‘2014లో నరేంద్ర మోదీ నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సంపూర్ణంగా నమ్మి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే బలమైన కాంక్షతోనే మద్దతు ఇచ్చామ‌ని తెలిపారు.

విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు బలమైన మంచి భవిష్యత్తు కావాలంటే ప్ర‌ధాని మోదీ, చంద్రబాబు ఆలోచనలు అవసరం అని భావించామ‌న్నారు. దశాబ్దకాలంలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన గాయం నుంచి కోలుకొని అత్యున్నతంగా ముందుకు వెళుతుందని అనుకున్నాను. అయితే అది జరగలేదన్నారు. ప్రస్తుత వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సమయంలో.. ప్రజలంతా అభద్రతలో బతుకుతున్న రోజుల్లో.. కచ్చితంగా రాష్ట్రాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు అనే బలంగా నిర్ణయించుకున్నానని తెలిపారు. 2021లో ఇచ్చిన పిలుపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పొత్తుతో కలిసి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లబోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

కూలీల సొమ్ము కొట్టేసి క్లాస్ వార్ అనడం జగన్ కే చెల్లిందన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొనకళ్ల నారాయణరావు(Konakalla Narayana Rao) వంటి వారిపై రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో దాడి చేయడం ఆంధ్రుల మీద జరిగిన దాడిగా భావిస్తానన్నారు. రాష్ట్ర విభజన చీకటి రోజు అని ఇటీవల నూతన పార్లమెంటు భవనం ప్రారంభ సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అభివర్ణించారు. ఏ పార్లమెంటు అయితే రక్షించాలో.. అక్కడ ఓ పార్లమెంటీరియన్ పై జరిగిన దాడి చాలా హేయమైన చర్యగా భావిస్తానన్నారు. విభిన్నమైన ఆలోచనలతో మనమంతా ఉన్నప్పటికీ.. ముందుగా మనం ఆంధ్రులం అనేది నిజం. మనందరి గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి. కలిసికట్టుగా సమస్యలపై పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కులభావన ఆటంకం కాకూడదన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా అత్యధిక లొసుగులు ఆంధ్రప్రదేశ్ లోనే బయటపడ్డాయన్నారు. కూలీలకు సంబంధించిన డబ్బులను పక్కదారి పట్టించారు. ఇది సాక్షాత్తూ కేంద్ర మంత్రి సాథ్వీ నిరంజన్ జ్యోతి లెక్కలతో సహా పార్లమెంటులో చెప్పిన మాట. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఏడాది 1,59,570 ఫిర్యాదులు వచ్చాయి. రూ.337 కోట్ల నిధులు పక్కదారి పట్టాయి. వీటిలో విచారణ చేసి.. మళ్లీ నిధులను రికవరీ చేసింది కేవలం రూ.6.24 కోట్లు మాత్రమే. అంటే కూలీ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం కనీసం రికవరీ కూడా చేయలేకపోయింది. ఈ డబ్బు ఎవరు తినేశారు.. ఎక్కడికి వెళ్లాయో కూలీలకు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ అని ఏ రీతిలో మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదన్నారు.

మాట్లాడితే దేశ ద్రోహం కేసులా..?.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా దేశద్రోహం కేసులను ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐపీసీ సెక్షన్ 124 (ఏ) అనే దేశ ద్రోహం కేసు బ్రిటీషు కాలం నాటిదని, దానిపై న్యాయ సమీక్ష జరుగుతున్నప్పటికీ జగన్ ప్రభుత్వం దాన్ని చాలామందిపై ఆ సెక్ష‌న్‌ పెట్టిందని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలు పట్టించుకోకుండా ఎడాపెడా ఆ కేసులు పెట్టిందని మండిప‌డ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై, పాలకులను నిలదీసిన వారిపై కేసులు పెట్టిందని.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాష్ట్రంలో చంపేసిందన్నారు. కేసులు పెట్టి బెదిరించాలనేది వైసీపీ ప్లాన్. అలాంటి వాటికి జనసేన భయపడదన్నారు.

హంతకులకు వంత పాడుతూ దర్జాగా గద్దెపై కూర్చున్న జగన్ కే ఏ భయం లేన‌ప్పుడు, దేశభక్తిని బలంగా గుండెల్లో నింపుకున్న మాకు ఎందుకు భయాలు ఉంటాయి..? అని ప్ర‌శ్నించారు. కేసులకు భయపడి మేం మీకు సలాం చేసే పరిస్థితి కలలో కూడా ఉండదన్నారు. ఆరు లక్షల ఉద్యోగాలని కల్లబొల్లి మాటలు చెప్పి.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతున్నారని విమ‌ర్శించారు. వీరు చెప్పే కాకమ్మ లెక్కలు వినే పరిస్థితి యువతకు లేదన్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. అక్కడ పనిచేస్తున్న సుమారు 50 వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు వింత లెక్కలు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లకు 3 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఉద్యోగాలు అనే పరిస్థితికి వైసీపీ వచ్చింద‌న్నారు.

జాబ్ క్యాలెండరు లేదు.. ఏ శాఖలోనూ ప్రత్యేక నోటిఫికేషన్ లేదన్నారు. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆటంకం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఇంత మంది యువత ఆవేదనతో మా దగ్గరకు ఎందుకు వస్తారు..? వారి బాధలను ఎందుకు చెప్పుకుంటారు..? అని ప్ర‌శ్నించారు. లంచాలకు మరిగి.. ప్రజల రక్తం తాగుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి లంచాలకు మరిగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఏ పని కావాలన్నా ప్రత్యేకంగా ధర పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. కొత్త పాస్ బుక్ కావాలంటే రూ.10 వేలు, ఆక్వా చెరువుల్లో ట్రాన్స్ ఫార్మర్ పెట్టుకోవాలంటే రూ.2 లక్షలు, ఆక్వా ఫీడ్ దుకాణం ప్రారంభించాలంటే రూ.2 నుంచి రూ.3 లక్షలు మేర వసూళ్లు చేస్తున్నారని మండిప‌డ్డారు.ఇసుక దోపిడీ, చెరువుల్లో మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందన్నారు.

జగనన్న ఇళ్లలో పేదలను ఆ పండగకు గృహ ప్రవేశాలు చేపిస్తాం... ఈ పండగ అంటూ చెప్పారు. పండగలు వెళ్లిపోయాయి తప్పితే... పేదలకు సొంతింటి భాగ్యం మాత్రం దక్కలేదన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు పార్లమెంటులో మన ఎంపీలు ప్లకార్డు పట్టుకొంటే.. జగన్ మాత్రం అప్పటి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ కంట పడకుండా ఎక్కడో వెనుకాల నక్కుతూ నిలబడ్డాడని విమ‌ర్శించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్ర పెద్దలను కలిసి.. సర్.. సర్.. మా కేసులను కాస్త చూడండి అని ప్రాధేయపడటం మాత్రమే తెలుసు అని ఎద్దేవా చేశారు.

జగన్ కు నిజంగా అంతటి సత్తా ఉంటే, ధైర్యవంతుడు అయితే రైల్వే జోన్ గురించి, పోలవరం పూర్తి గురించి, స్టీల్ ప్లాంటు గురించి, రాజధాని గురించి ఎందుకు కేంద్రాన్ని అడగరు..? ప్రజల గురించి ఎందుకు మాట్లాడరు..? అని ప్ర‌శ్నించారు. నాకు ఎలాంటి రాజకీయ బలం లేకున్నా నిజాయతీ అనే నైతిక బలం ఉంది. అందుకే ఎలాంటి భయం లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంటు సమస్య గురించి మాట్లాడాను. ప్లాంటు ప్రైవేటీకరణ వద్దని కోరానన్నారు. అప్పట్లో అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగితే నిలబడలేకపోయామ‌ని.. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయామ‌ని వివ‌రించిన‌ట్లు తెలిపారు.

జగన్ ను ప్రశ్నించే వారంతా అతడికి శత్రువులే. ఎవరి మీద అయినా దేశద్రోహం కేసులు పెడతాడు.. రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకుంటాడు. మాజీ ముఖ్యమంత్రి మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిస్తాడు. జనసైనికులపై హత్యాయత్నం కేసులు పెట్టి ఆనందిస్తాడు. రాష్ట్రానికి ఏదో మంచి చేస్తాడని ప్రజలంతా 151 అసెంబ్లీ సీట్లు, 22 మంది పార్లమెంటు సభ్యుల బలం ఇస్తే.. ఆఖరికి రాజకీయం కోసం అందరిపై కేసులు పెట్టిస్తున్నాడు. జగన్ తీరు చూస్తే 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మపై ప్రతాపం చూపిస్తున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

మంచి పాలన అందించాలని జనం కోరుకుంటే.. జగన్ మాత్రం తనకు రాజకీయ శత్రువు ఎవరూ ఉండకూడదనేలా చూసుకుంటున్నాడ‌ని అన్నారు. జగనన్నే మన భవిష్యత్తు అంటూ వైసీపీ నాయకులు కొత్త కార్యక్రమం చేస్తున్నారు. జగన్ ఆంధ్రా భవిష్యత్తు కాదు.. ఆంధ్రాకు వచ్చిన విపత్తు అని విమ‌ర్శించారు. చేయాల్సిన పనులన్నీ చేస్తూ.. ఏదో పుచ్చలపల్లి సుందరయ్య గారిలా, కార్ల్ మార్క్స్ లా, చేగువేరాలా మాటలు చెబుతాడని విమ‌ర్శించారు.

పవన్ కళ్యాణ్ ను ఆర్థికంగా దెబ్బ తీయాలనే లక్ష్యంతో నా సినిమాలు వచ్చినపుడు టిక్కెట్ రేట్లను తగ్గిస్తాడు. అధికార గణాన్ని ఉపయోగించిన మరీ టిక్కెట్ రేట్లు తగ్గించి ప్రజలకు మేలు చేస్తాను అంటాడు. నా పుట్టినరోజు వచ్చే సమయానికే జగన్ పర్యావరణ పరిరక్షణ గుర్తుకొచ్చి ఫ్లెక్సీలను నిషేధిస్తామని జీవోలు తెస్తాడు. నా పుట్టినరోజు అయిపోయిన వెంటనే ఆ ఫ్లెక్సీల నిషేధం గాలిలో కలిసిపోతుంది. వేలాది మంది యువత ఫ్లెక్సీల ప్రింటింగ్ పరిశ్రమలో ఉన్నారు. ఉన్నట్టుండి నిషేధం అంటే వారంతా రోడ్డున పడాలనే కనీస ఇంగితం కూడా ఉండదు. కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకునే రకం జగన్ అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

పవన్ కళ్యాణ్ ను తిట్టించడానికి కాపులను ఉపయోగిస్తాడు. అది కాకపోతే బీసీ నాయకులు, ఎస్సీ నాయకులతో తిట్టిస్తాడు. అంటే కాపులు, బీసీలకు గొడవ పెట్టాలనేది ప్లాన్. అలాగే దళితులు కాపులు ఘర్షణ పడాలనేది ప్లాన్. కులాలను విడదీసి రాజకీయం చేయాలని జనసేన ఎప్పుడూ అనుకోదు. మాది మానవత్వం నింపుకున్న పార్టీ. అన్నీ కులాలను సమానంగా చూసి, వారిని రాజ్యాధికారంలో భాగం చేయాలనే ఆలోచన మాది. కులాలను విడదీసి, వారి మధ్య చిచ్చు పెట్టాలనుకునే స్వభావం ఉన్న నాయకుడు జగన్. కులాల మధ్య గొడవలు జరిగితే, అభివృద్ధి గురించి అడగరు.. ఉద్యోగాల గురించి యువత అడగరు అనే ఆలోచనతోనే గొడవలు పెట్టాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు.

పెడన బహిరంగ సభలో దాడులు జరగొచ్చు అని నేను మాట్లాడితే పోలీస్ శాఖ నాకు నోటీసులు పంపించారు. సమాచారం ఇస్తే విచారణ చేస్తామని మాట్లాడారు. నాకు వచ్చిన సమాచారం నేను చెప్పాను. దానిని మీరు విచారించి నిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు. కోనసీమలో అల్లర్లు జరుగుతాయని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చెప్పింది. అలాగే విశాఖలో పర్యటిస్తున్నప్పుడు గొడవలు సృష్టించాలని చూస్తున్నారు అని మాట్లాడాను. అవన్నీ జరిగాయి. మాకు కచ్చితమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాం అని తెలిపారు. పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. మీరు రాజకీయాల్లో తలదూరిస్తే ఎలా? మీ విధులు మీరు నిర్వర్తించండి. రాజకీయ పరమైన సమస్యలు మేము వైసీపీతో తేల్చుకుంటామ‌న్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నంద్యాలలో పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. నేను అదే రోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విజయవాడ వస్తుంటే హైదరాబాద్ విమానాశ్రయంలో నా విమానం టేకాఫ్ అవ్వకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గం గుండా వస్తుంటే ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ లో అడ్డుకున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు కోసం ఏసీబీ కోర్టు వద్దకు మీరు వెళ్తారనే సమాచారం ఉంది అందుకే అడ్డుకున్నాం అని పోలీసులు అధికారులు సమాధానం చెప్పారు. మీకు అప్పుడు సమాచారం ఇచ్చింది ఎవరో చెబితే.. పెడనలో అల్లర్లు జరగొచ్చు అని నాకు ఎవరూ చెప్పారో సమాచారం ఇస్తా. బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారులు కూడా వైసీపీకి వత్తాసు పలికితే ఎలా? అని ప్ర‌శ్నించారు. అసలు నేను ఎందుకు ఏసీబీ కోర్టుకు వెళ్తాను? కోర్టు విధులకు ఎందుకు ఆటంకం కలిగిస్తాను? ఎంత చెప్పినా నన్ను నా కార్యాలయానికి వెళ్లనివ్వలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇంతటి ప్రజాదరణ ఉన్న నాలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. నేను ఏ రోజైనా రెచ్చగొట్టేలా మాట్లాడానా? శాంతిభద్రతలకు విఘాతం కలిగించానా?.. అలాంటి వ్యక్తినే అయితే ప్రధానమంత్రి నన్ను పక్కన పెట్టుకుంటారా? అని ప్ర‌శ్నించారు.

కడప జిల్లా పులివెందుల చదువులకు పుట్టినిల్లు. అలాంటి ప్రాంతాన్ని గొడవలకు, గూండాయిజానికీ కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆరోపించారు. మీ దాడులు, రౌడీయిజం సంస్కృతి తీసుకొచ్చి బెదిరించాలని చూస్తే నేను మామూలు వ్యక్తిని కాదు. చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటావు. నన్ను చూడలేదు. మీ నాన్నతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తిని నేను. ఆయన దాడి చేయించడానికి మనుషులను పంపిస్తే పార్టీ ఆఫీసులో అందరూ పారిపోయినా.. ఒక్కడినే కూర్చున్నాను. గుండె ధైర్యం, చెయ్యే ఆయుధంగా నిలబడ్డాను. గూండాలతో, అల్లరి మూకలతో రాళ్లు దాడి చేయిస్తే భయపడిపోతాం అనుకుంటే ఎలా.? దేశభక్తులతో గొడవ పెట్టుకుంటే తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూపిస్తామ‌న్నారు.

నేను 2009లో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ రాజకీయాల్లో కూడా లేర‌ని అన్నారు. ఆయన పరీక్షల్లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం గురించి ఆలోచిస్తున్నాను. ప్రాణాలకు తెగించే పార్టీ పెట్టాను. మహా అయితే ప్రాణం పోతుంది. కానీ మనం పంచిన స్ఫూర్తి నిలబడిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ మీద నేను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు నా మీద కేసులు పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం ఉంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా నేను వెనకడుగు వేయను. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప ఆడిన మాట తప్పనన్నారు.

వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ. దాని మూలాలు నానక్ రాంగూడాలో ఉన్నాయి. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు. ఆ హక్కు వాలంటీర్లకు లేదు. ఈ మాటలకు నేను కట్టుబడే ఉన్నానన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2021లో మాట్లాడాను. దాని కోసం కలిసి వచ్చే పార్టీలతో వెళ్తానని చెప్పాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్నా మాటకు కట్టుబడి వాళ్లతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తాన్నాము. ఇంకా ఎవరూ కలిసివచ్చినా కలుపుకొని వెళ్తాం. దీనిపై బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు.

అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. అడ్డగోలుగా లక్ష కోట్లు దోచేశాడని.. తెలిసినా ఆయనకే ఓట్లు వేశాం అంటే అవినీతిని మనం ఆమోదించినట్లేన‌న్నారు. ఇప్పుడు అవినీతి మన దినచర్యలో భాగమైపోయిందన్నారు.

‘ఓటుకు రూ.500 నుంచి రూ. 2000 తీసుకుంటున్న మనం అవినీతి గురించి మాట్లాడే హక్కు ఎప్పుడో కోల్పోయాం’.. ఈ మాట నేను చెప్పింది కాదు సాక్షాత్తూ జగన్ ప్రచారకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన మాట.
ఓటుకు రూ. 500 తీసుకుంటే హరిశ్చంద్రుడు లాంటి నాయకులు ఎక్కడ వస్తారు అని ఆయన మాట్లాడాడు. నేను అయితే ఓట్లు కొనడానికి డబ్బులు ఇవ్వలేను. మీ భవిష్యత్తు కోసం నిలబడతాను అని అన్నారు. జనసేన పార్టీకి అధికారంలోకి రావడం అంతిమలక్ష్యం కాదు. 2,047కి బలమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే లక్ష్యం అన్నారు.

అడ్డగోలుగా లక్షకోట్లు దోచుకున్న వ్యక్తికి ఏసీబీని శాసించే హక్కు ఎక్కడిది? క్రమ కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే హక్కు ఎక్కడ ఉంది? అని ప్ర‌శ్నించారు. ఆయన అడ్డగోలుగా దోపిడీ చేసి మనందరి మీద అవినీతి బురద జల్లుతున్నాడని విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పేరిట డబ్బులు పంచి దానిని అభివృద్ధి అంటోందన్నారు. రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి ఎక్కడుంది? రూ. 8,600 కోట్ల పంచాయతీల నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు.

నా తొలి ప్రాధాన్యత నా రాష్ట్రం, నా నేల, నా ప్రజలు. వాళ్ల కోసం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా.. పదేళ్లుగా నిలబడి ఉన్నాను. ఆంధ్ర అభివృద్ది చెందాలని బలంగా నిర్ణయం తీసుకున్నానన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తోనే అది సాధ్యమ‌న్నారు. జనసేన- తెలుగుదేశం కూటమితో ఎవరూ కలిసివచ్చిన ఆహ్వానిస్తామ‌న్నారు. భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ఎన్ని కుట్రలు, ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన – తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకోలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీకటి రోజులు పోవాలంటే మా కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఒకరి కోసం ఒకరం నిలబడి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేద్దాం అని పిలుపునిచ్చారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కలిసికట్టుగా పోరాటం చేసి విజయభేరి మోగిద్దామని” అన్నారు.

Updated On 4 Oct 2023 8:28 PM GMT
Yagnik

Yagnik

Next Story