Pawan Kalyan: అలాంటి వారు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే: పవన్ కళ్యాణ్
నేటి సమాజంలో డబ్బులేని రాజకీయాలు సాధ్యం కావని, డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయాలని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నాడు పలువురు టీడీపీ, బీజేపీ నాయకులను కలుసుకున్నారు. అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఒక వయసు వచ్చాక రాజకీయాల్లో ఉండకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. 80–90 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఎలా వస్తాయని అన్నారు. అలాంటి వారు రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
నేటి సమాజంలో డబ్బులేని రాజకీయాలు సాధ్యం కావని, డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయాలని తాను ఏనాడూ చెప్పలేదని తెలిపారు. ఎవరికీ భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేస్తానంటే కుదరదన్నారు. డబ్బులు ఖర్చులు పెట్టాలన్న విషయాన్ని ఇప్పటికే నాయకులకు చెప్పానని తెలిపారు. ఓట్లు కొంటారో.. ఏం చేస్తారో తాను చెప్పనని, అది మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులపరంగా జరిగే గొడవలను పార్టీలకు అంటగట్టడం మంచిది కాదని, కులంలో ఒకరు తప్పుచేస్తే ఆ తప్పును మొత్తం కులంపై మోపుతున్నారన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియాల్సి ఉంది.