Good News: రేపే జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
ప్రతి ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంత మందికీ విద్యా దీవెన స్కీమ్ ద్వారా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లిస్తోంది
జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 1వ తేదీన కృష్ణా జిల్లా పామర్రులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి సీఎం జగన్‌మోహన్ రెడ్డి విద్యాదీవెన డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29న నిర్వహించాలని భావించినా కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మార్చి 1వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లిస్తోంది. ప్రతి ఏడాది మొత్తం మూడు విడతల్లో ఈ డబ్బును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
ప్రతి ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంత మందికీ విద్యా దీవెన స్కీమ్ ద్వారా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ. 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15,000, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ. 20,000 సాయం అందిస్తోంది. ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించింది. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం జగన్న వసతి దీవెన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.