YS Jagan : చిరంజీవికి విషెస్ చెప్పని జగన్... ఇదే కారణమా?
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! చిరంజీవి పుట్టిన రోజంటే మామూలుగా ఉండదు.
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! చిరంజీవి పుట్టిన రోజంటే మామూలుగా ఉండదు. తెలుగునాట ప్రతి చోటా వేడుకలు జరుగుతాయి. సోషల్ మీడియాలో చిరంజీవికి బర్త్ డే విషెస్‌లు తామరతంపరగా వచ్చిపడుతుంటాయి. ఇన్‌బాక్స్‌లు నిండిపోతాయి. దాదాపు ప్రముఖలందరూ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతారు. ఈసారి కూడా అదే రెస్పాన్స్. ఏటికేడు పెరుగుతున్నదే తప్ప చిరంజీవి క్రేజ్ తగ్గడం లేదు. ఆశ్చర్యమేమిటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) శుభాకాంక్షలు చెప్పకపోవడం. ప్రతి సంవత్సరం ఎక్స్ (ట్విట్టర్)ద్వారా చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పే జగన్ ఈసారి సైలెంట్‌గా ఉండటం ఆశ్చర్యకరం. నిజానికి చిరంజీవి(Chiranjeevi), జగన్మోహన్‌రెడ్డి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. చిరంజీవిపై జగన్ తన అభిమానాన్ని పలు మార్లు చాటుకున్నారు కూడా! చిరంజీవి దంపతులను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. అన్నా అంటూ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించారనీ, అన్నలాగే అదరించారని చిరంజీవి చెప్పారు కూడా! జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan kalyan) జగన్ ఘాటైన విమర్శలు చేసినా చిరంజీవి పల్లెత్తు మాట అనలేదు. లాస్టియర్ మాత్రం చిరంజీవి బయటపడ్డారు. తమ్ముడు పవన్ కల్యాణ్‌పై వస్తున్న విమర్శలపై చిరంజీవి నర్మగర్భంగా మాట్లాడారు. పవన్‌పై అడ్డమైన విమర్శలు చేస్తున్నప్పుడు బాధగా ఉంటుందని, పవన్‌ను తిట్టినవాళ్లు తన దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తుంటారని, తమ్ముడిని అనరాని మాటలు అన్నవారితో మళ్లీ మాట్లాడాల్సి వస్తున్నదే అన్న బాధ విపరీతంగా ఉంటుందని చిరంజీవి కామెంట్ చేశారు. ఇవి జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని చాలా మంది భావించారు. పైగా సినిమా పరిశ్రమలోని సాదకబాధకాలను చర్చించడానికి జగన్ దగ్గరకు చిరంజీవి వెళ్లినప్పుడు నమస్కారానికి జగన్ ప్రతినమస్కారం చేయలేదని, అది జగన్ సంస్కారమని చిరంజీవి అభిమానులు అప్పట్లో మండిపడిన విషయం తెలిసిందే! అప్పుడు కూడా చిరంజీవి మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. తను అధికారం కోల్పోవడానికి పవన్ కల్యాణ్ కూడా కారకుడేనన్న తలంపు జగన్‌లో ఉంది. ఆ కోసం జగన్‌లో ఉండి ఉంటుంది. ఎంతైనా పవన్‌కు స్వయాన సోదరుడు కాబట్టి చిరంజీవి పట్ల మునుపటి అభిమానాన్ని జగన్ చూపించకపోవచ్చు. ఆ కారణంతోనే చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవచ్చు. మొత్తంగా జగన్-చిరంజీవి మధ్య గ్యాప్ అయితే బాగా పెరిగిందని అర్థమవుతోంది