బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అరెస్ట్‌ను అడ్డుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీ)కి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని టీడీఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నమే ఇదని రామయ్య అన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లదాడి ఘటనలో టీడీపీ అభ్యర్థికి ఎలాంటి ప్రమేయం లేదని రామయ్య స్పష్టం చేశారు. అంతేకాకుండా బోండా ఉమామహేశ్వరరావును ఈ కేసులో ఇరికించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసు కమీషనర్‌ను ఆయన స్థానం నుంచి తొలగించడంతో పాటు తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో ఈసీని కోరింది.

సీఎం జగన్ పై రాళ్ల దాడి వ్యవహారంలో తన చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం ఈ డ్రామా ఆడుతున్నారని.. వారు ఆశించిన సానుభూతి లభించకపోవడంతో, ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. అన్యాయంగా ఇరికిస్తే జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించండి.. తాను విచారణకు సహకరిస్తానని బోండా ఉమా అన్నారు. వేముల దుర్గారావును హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారన్నారు బోండా ఉమా.

Updated On 17 April 2024 8:57 PM GMT
Yagnik

Yagnik

Next Story