TDP-Janasena-BJP భారతీయ జనతా పార్టీ ఒంటరి పోటీ చేస్తుందా?
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందా
తెలుగుదేశం పార్టీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయని ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం టీడీపీ అంటే చాలు వెనకడుగు వేస్తోంది. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీని చంద్రబాబు వాడుకున్న విధానమే! 2014 సమయంలో భారతీయ జనతా పార్టీతో టీడీపీ చెట్టాపట్టాలేసుకు తిరిగింది. ఆ తర్వాత ఒక నాలుగేళ్లు చాలా బాగా సాగింది వీరి స్నేహం. ఎంతగా అంటే ఏకంగా స్పెషల్ స్టేటస్ ను తాకట్టుపెట్టేతంటలా! స్పెషల్ ప్యాకేజీని తీసుకుని నాలుగేళ్లకు పైగా చంద్రబాబు రాజకీయాలను నడిపారు. అయితే ఆ తర్వాత బీజేపీని ఇష్టమొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై పర్సనల్ అటాక్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు అవసరం చంద్రబాబుది.. 2024లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని అనుకుంటున్న చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారం పంపారు. అయితే ఇప్పటి వరకూ బీజేపీ నుండి ఎలాంటి పొత్తు ప్రకటన రాలేదు. బీజేపీ నేతలు బాబుతో దోస్తీ అంటేనే భయపడిపోతూ ఉండడం.. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటూ ఉందనే అనుమానాలకు తావిస్తూ ఉంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందా అనే వార్తలు టీడీపీ-జనసేన కూటమిని టెన్షన్ పెడుతూ ఉన్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీకి బీజేపీ నాయకుల నుండే రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పొత్తే అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఓటు షేర్ ను పెంచుకోవచ్చు.. కొన్ని పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవచ్చే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 3283 దరఖాస్తులు వచ్చాయంటే బీజేపీ నేతల ఉద్దేశ్యం ఏమిటో అర్థం అవుతూ ఉంది. 25 లోక్‌సభ స్థానాలకుగానూ 1861 దరఖాస్తులు బీజేపీ అధిష్టానం దగ్గరకు వెళ్లాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అటు బీజేపీ నాయకులు.. ఇటు కూటమి నేతలు ఆసక్తికరంగా గమనిస్తూ ఉన్నారు.