రాజమండ్రి లోక్‌సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ చీఫ్‌ సోము వీర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

రాజమండ్రి లోక్‌సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeshwari), మాజీ చీఫ్‌ సోము వీర్రాజు(Somu Veerraju)ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమితో పొత్తు పెట్టుకోని బీజేపీ(BJP) ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లుగా ముద్ర వేస్తూ అభ్యర్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ప‌లువురు ఏర్పాటు చేయడం క‌ల‌క‌లం రేపుతుంది.

పొత్తులపై జాతీయ పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని.. అభ్యర్థుల జాబితాపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఇప్ప‌టికే రాష్ట్ర అధ్యక్షురాలు స్పష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ సోము వీర్రాజు రాజమండ్రిలో ప్రచారాన్ని ప్రారంభించడం ఆశ్చర్యం క‌లిగించే విష‌యం. కొన్ని వారాల క్రితం వీర్రాజు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచార పోస్టర్లు వెలిశాయి.

అంతేకాదు ప్రజా పోరు యాత్ర పేరుతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా పురంధేశ్వరి, విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి జీవీఎల్ నరసింహారావు అభ్యర్థిగా పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తమది జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర నాయకత్వమే అన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉన్నందున సోము వీర్రాజు అభ్యర్థిత్వంపై ఎలాంటి వాదనలు చేయడం ముందస్తు పరిణితి అవుతుందని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. 2014లో రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆయనకు కేవలం 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, టీడీపీ-జనసేనతో పొత్తుకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆ సీటు ఏ పార్టీని వ‌రించ‌నుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

Updated On 23 Feb 2024 10:14 PM GMT
Yagnik

Yagnik

Next Story