illegal Affair Leads to Murder: వివాహేతర సంబంధం భార్యాభర్తల ప్రాణం తీసింది..!
ఓ మహిళకు పెళ్లయి భర్త ఉన్నా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఓ మహిళకు పెళ్లయి భర్త ఉన్నా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పక్కాగా ప్లాన్ చేసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ప్రియుడి చేతిలో ఆ మహిళ హత్యకు గురైంది. ఈ నెల 6న గిద్దలూరు(Giddalur)లోని చాకలివీధిలో పాకి సుభాషిణి (paki Shubhasini)అనే మహిళ ఆమె ప్రియుడు అంబడిదాసు శ్రీకర్ అలియాస్ నాని చేతిలో హత్యకు గురైంది. ఈ హత్య కేసు నిందితుడు శ్రీకర్(Sreekar)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఎప్పుడో జరిగిన మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
కంభం మండలం నర్సిరెడ్డిపల్లెకు చెందిన పాకి బాలకృష్ణకు రాచర్లకు చెందిన సుభాషిణితో వివాహం జరిగింది. ఈ జంటకు ఓ కూతురు, కొడుకు లోకిత, రోహిత్ ఉన్నారు. గిద్దలూరులో ఓ ఇంట్లో బాలకృష్ణ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇదే సమయంలో సుభాషిణికి తన టెన్త్ క్లాస్మెట్ నాని కలిశాడు. గిద్దలూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాని సుభాషిణితో తరుచూ మాట్లాడేవాడు. పాత స్నేహాన్ని వివాహేతర సంబంధంగా మార్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత వీరి వ్యవహారం బాలకృష్ణకు తెలిసింది. భార్య చేస్తున్న తప్పుడు పనిని జీర్ణించుకోలేక మద్యం తాగి భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ వేధింపులు భరించలేని సుభాషిణి ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నానితో కలిసి ప్లాన్ వేసింది. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 4న మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి తాగించింది. మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత నానితో కలిసి బాలకృష్ణ మొహానికి గుడ్డకట్టి, గొంతుకు తాడి బిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించింది, బంధువులను నమ్మించి దహనసంస్కారాలు పూర్తి చేయించింది. బాలకృష్ణ మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. బాలకృష్ణ కర్మకాండలు అయిపోయిన తర్వాత ప్రియుడు నానితో కలిసి హైదరాబాద్‌లో మకాం పెట్టింది. ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. ఈక్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సుభాషిణి తిరిగి గిద్దలూరు వెళ్లిపోయింది. ఆ తర్వాత నాని తరుచూ తనతో మాట్లాడాలని సుభాషిణిని వేధించేవాడు. ఆమె పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించగా.. నానిని మందలించారు. ప్రియురాలు దూరం పెట్టడంతో నాని జీర్ణించుకోలేకపోయాడు. ఓ రోజు ఆమెపై కత్తితో దాడిచేశాడు.. మార్కాపురం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ కేసులో నిందితుడు నానిని అదుపులోకి తీసుకొని విచారించగా సుభాషిణి భర్త హత్య విషయం కూడా వెలుగులోకి వచ్చింది.