రాష్ట్రవ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో ఐబీ (ఇంటర్నేషనల్ బాక్యులరేట్) కరిక్యూలమ్ ను అందుబాటులోకి తీసుకురావటం వల్ల ప్రతి విద్యార్థి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోగలరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో ఐబీ (International Baccalaureate) కరిక్యూలమ్ ను అందుబాటులోకి తీసుకురావటం వల్ల ప్రతి విద్యార్థి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోగలరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తెలిపారు. విజయవాడ(Vijayawada)లోని సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఐబీతో కలిసి ముందుకు సాగటానికి ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. కేవలం రూ. 149 కోట్ల ఖర్చుతో 5 ఏళ్లలో ఐబీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఐబీని కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ప్రవేశపెట్టారన్నారు. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో మొదట ఐబీ ల్యాబ్ లు ఏర్పాటు చేసి ఆపై అన్ని పాఠశాలల్లో ఒకేసారి తీసుకువస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా మన రాష్ట్ర విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వటానికి ఒక సంస్థ ముందుకు రావటం అభినందనీయమని మంత్రి అన్నారు.

విద్యపై పెట్టే ప్రతి పైసా పేద విద్యర్థులకు వరంలా మారుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కార్పొరేట్ పాఠశాలల(Corporate Schools)కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థి కూడా పోటీలో నిలబడే విధంగా విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని వివరించారు. 3వ తరగతి నుండి టోఫెల్ అందుబాటులకి తీసుకువచ్చామన్నారు. తద్వారా అవసరమైన వారికి ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికెట్ లను అందిస్తున్నట్లు తెలిపారు.

బైజూస్ కంటెంట్(Byjus Content)) తో కూడిన ఉచిత ట్యాబ్ లను 8వ తరగతి విద్యార్థులకు అందిస్తున్నామని చెబుతూ తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసే క్రమంలో నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చివేయటమే గాక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక చర్యలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనించటంతో పాటు అమలు చేయటానికి ఉత్సాహం చూపుతున్నాయన్నారు.

విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి దశలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. బైజూస్ కంటెంట్ సైతం ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు అందించిన ట్యాబ్ లు ఓపెన్ టెండర్ ద్వారానే తీసుకున్నామని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా ప్రపంచ స్థాయిలో మన రాష్ట్ర విద్యార్థులు పోటీ పడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. టోఫెల్ కంటెంట్ విద్యార్థులకు అందించడానికి ఒక్కో విద్యార్థికి కేవలం రూ. 7.50 మాత్రమే ఖర్చు అవుతుందని వివరించారు. ఇప్పటి వరకు హర్యాణా, మహారాష్ట్ర, దిల్లీ మాత్రమే ఐబీతో ఎంఓయూ చేసుకున్నాయని మంత్రి గుర్తుచేశారు.

పేదవారికి సైతం అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, కానీ కొందరు బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఎప్పుడూ పేదలుగానే మిగిలిపోకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated On 20 Oct 2023 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story