శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నా.. ఎన్నికలకు పనికొస్తారు అని పోస్టింగ్ లు పెడుతున్నట్లు

తనను, తన సోదరి వైఎస్ షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నారని, సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ప్రాణభయంతో ఇటీవల హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. 509, 506 IPC తో పాటు 67 IT యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను, సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు లేపేస్తామంటూ.. శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నా.. ఎన్నికలకు పనికొస్తారు అని పోస్టింగ్ లు పెడుతున్నట్లు సునీత వైరల్ పోస్టులకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్టింగ్ లు పరిశీలించిన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ స్పందన:
సోషల్ మీడియా వేదికగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. షర్మిల, సునీతపై జరిగిన ఈ అవమానకర మైన దాడిని తాను, కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుందని వెల్లడించారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీ, తాను అండగా ఉంటానని తెలిపారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపంద చర్య అని రాహుల్ అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా అలాంటి వాళ్లకు ఒక ఆయుధంగా మారిపోయిందన్నారు రాహుల్ గాంధీ.

Updated On 6 Feb 2024 12:21 AM GMT
Yagnik

Yagnik

Next Story