Vidadala Rajini:జగన్‌కు 'షేక్' హ్యాండిచ్చిన విడుదల రజినీ..?
ఆంధ్రప్రదేశ్‌లోనూ వలసలు కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీని నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ వలసలు కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ(YSRCP)ని నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. పార్టీలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి, జగన్(YS Jagan)ను ఆకాశానికి ఎత్తుకున్న నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తూ పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజిని(Vidadala Rajini) కూడా పార్టీని వీడినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విడుదల రజినీ స్థానాన్ని మార్చారు. ఆమె నియోజకవర్గం చిలుకలూరిపేట(Chilakaluripeta) నుంచి గుంటూరు(Guntur)కు మార్చడంతో తాను ఓడిపోయానన్న అసంతృప్తి రజినీలో ఉందని తెలుస్తోంది. జగనన్న అంతటి మంచి నాయకుడు లేడని గతంలో ఆమె ఎన్నోసార్లు పొగిడారు. తాజాగా రజినీ మనసు మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీ వీడుతున్నట్లు రజినీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే పార్టీ ఓడిన తర్వాత వైసీపీ సమావేశాలకు విడుదల హాజరయ్యారు. పార్టీలో గతంలోనూ.. ఇప్పటికీ విడుదల రజినీకి మంచి ప్రాధాన్యమే దక్కిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. త్వరలోనే జనసేన పార్టీ(Janasena Party)లోకి వెళ్లే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.
విడుదల రజినీ అమెరికా(America)లో నివాసం ఉండేవారు. చిలుకలూరిపేటలో వీఆర్ ఫౌండేషన్(VR Foundetion) ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2014లో టీడీపీ(TDP)లో చేరి అప్పటి చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు(Pathipati Pulla Rao) శిశ్యురాలిగా పనిచేశారు. టీడీపీలో చురుకుగా ఉంటూ పలు కార్యక్రమాలు చేపట్టారు. భాషా ప్రావీణ్యం, సేవా కార్యక్రమాలు చేపట్టడంతో ఆమెకు టీడీపీలో కూడా ప్రాధాన్యం దక్కింది. ఓ సారి మహానాడులో జగన్‌కు వ్యతిరేకంగా, చంద్రబాబు(Chandrababu) నిర్మించిన హైటెక్ సిటీలో తానొక మొక్కనని చెప్పి చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. అయితే 2019లో చిలుకలూరిపేట టికెట్ రజినీకి దక్కలేదు. దీంతో వెంటనే వైసీపీలో చేరి, ఆ పార్టీ టికెట్ తెచ్చుకుని ప్రతిపాటి పుల్లారావుపై గెలిచారు. జగన్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో తన నియోజకవర్గం మార్చడమే కాకుండా, పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని ఆమె మనస్తాపం చెందారని.. అందుకే పార్టీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.