జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎంతగానో పోరాటం చేసిన

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి పోతిన మహేష్‌. అయితే ఎన్నికల సమయానికి వచ్చే సమయానికి ఆయనను నమ్మిన వాళ్లకు సీట్లను కేటాయించలేదు. దీంతో చాలా మంది జనసేనను వీడారు. అలా పోతిన మహేష్ జనసేనను వదిలి వైసీపీలో చేరారు. తాను పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయానని వాపోయారు. పవన్‌ మాటలు నమ్మి, జనసేన పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించానని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేనను టీడీపీకి అమ్మేశారని పోతిన మహేష్ వాపోయారు.

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ అయిన పవన్‌ బయటకు వచ్చి పొత్తును ప్రకటించారన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌ ఆయన పేరిట, బినామీల పేరుతో భారీగా ఆస్తులు కొన్నారని ఆరోపించారు. ఆ ఆస్తుల చిట్టాను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. వాటిలో కొన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటిని తానే బయటపెడతానని చెప్పారు. జనసేన పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పార్టీ ఎంత సేకరించిందో వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు. పవన్‌ తన బ్లాక్‌ మనీ మొత్తం హరిహర వీరమల్లు సినిమాకు పెడుతున్నారని.. ఆ సినిమా అసలు నిర్మాత పవనే అని, వేరే వ్యక్తుల పేరుతో తీస్తున్నారని అన్నారు. ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పవన్‌ కళ్యాణ్ పై నిర్మాత దిల్‌రాజు ఆదాయ పన్నుల శాఖకు ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా చెప్పాలన్నారు. జనసేన పార్టీ కోసం తాను చేసిన కష్టాన్ని ఇతరులకు రూ.30 కోట్లకు ఒకరికి అమ్మేసుకున్నారని మహేష్‌ ఆరోపించారు. అదే వ్యక్తి మరో రూ.10 కోట్లు టీడీపీకి చెల్లించారని తెలిసిందన్నారు పోతిన మహేష్.

Updated On 21 April 2024 12:13 AM GMT
Yagnik

Yagnik

Next Story