Hit And Run Case in NTR district : ఎన్టీఆర్ జిల్లాలో హిట్ అండ్ రన్ కేసు...దిశ యాప్‌తో నిమిషాల్లో స్పందించిన పోలీసులు
నడుచుకుంటూ వెళుతున్న తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు బైక్ తో ఢీ కొట్టి పారిపోయారని ఓ మహిళ దిశ(Disha) యాప్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
నడుచుకుంటూ వెళుతున్న తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు బైక్ తో ఢీ కొట్టి పారిపోయారని ఓ మహిళ దిశ(Disha) యాప్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు(Hit And Run Case) నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా(NTR District) అజిత్ సింగ్ నగర్(Ajit Singh Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
రాజరాజేశ్వరి పేటలో నివాసం ఉండే నాగరాజు(Nagaraju) అనే వ్యక్తి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. అజిత్ సింగ్ నగర్ లోని పైపుల రోడ్డు నుండి వైయస్సార్ కాలనీ వైపు నడుచుకుంటూ వెళుతున్న నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వేగంగా వెళ్ళి ఢీ కొట్టారు. ఈ ప్రమాదం లో నాగరాజు కాలుకు తీవ్ర గాయమై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న బాధితుడి భార్య రాజేశ్వరి దిశా పోలీసులకు కాల్ చేసి సహాయం కోరింది.
బాధితులు దిశ యాప్ కు కాల్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం బాధితుడి భార్య రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన వివరాలతో పాటు, సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలంచి ఆక్సిడెంట్ చేసిన ఆగంతకులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తమకు సహాయం చేయడంతో పాటు కేసు నమోదు చేసిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.