రాష్ట్రంలో వేసవి, విద్యార్ధులకు పరీక్షల సమయం దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో వేసవి, విద్యార్ధులకు పరీక్షల సమయం దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరా(Power Supply)లో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి(KS Jawahar Reddy) ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వేసవి విద్యుత్ సరఫరా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవి, విద్యార్ధులకు పరీక్షల సమయం దృష్ట్యా రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా గృహ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంచినీటి సరఫరా పధకాలకు ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులపై నిర్దిష్ట కాల వ్యవధి లోపు సకాలంలో చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
వ్యవసాయానికి 9 గం.ల ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా లోడ్ మానిటరింగ్ సెల్(ఎల్ఎంసి)ల ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం మానిటర్ చేయడం ద్వారా మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకూ విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి మీడియాలో వచ్చే నెగెటివ్ కధనాలపై మూడు విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా తీసుకుంటున్నచర్యలపై నివేదిక సమర్పించాలని సిఎస్ జవహర్ రెడ్డి స్పెషల్ సిఎస్ విజయానంద్ ను ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేక ఇతర ఫిర్యాదులకై టోల్ ఫ్రీ నెంబరు 1912ను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి విజ్ణప్తి చేశారు. కస్టమర్ కేర్ సెంటర్లకు వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా విద్యుత్ సంబంధిత ప్రమాదాల నివారణకు ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు పంపిణీ సంస్థల వారీగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. అనంతరం వివిధ విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏవిధంగా మానిటర్ చేస్తుందీ,ఫిర్యాదులపై ఎంత సమయంలో స్పందించి చర్యలు తీసుకుంటుందీ తదితర అంశాలపై సిఎస్ సమీక్షించారు.
రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను సిఎస్ కు వివరిస్తూ.. విద్యుత్ పంపిణీ సంస్థల వారీగాను, జిల్లా స్థాయిలోను కంట్రోల్ రూమ్ ల ద్వారా 33 కెవి,133 కెవి,220 కెవి విద్యుత్ స్టేషన్ల ద్వారా జరిగే విద్యుత్ సరఫరా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ట్రాన్సుఫార్మర్ బ్రేక్ డవున్ అయినా లేక ఇతర విధానాలైన అంతరాయం కలిగినా నిర్ధిష్ట కాల వ్యవధిలో ఆసమస్యను సరిచేయడం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా విద్యుత్ సరఫరాకు సంబంధించి డైలీ 9 రకాల ఫార్మాట్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని విజయానంద్ వివరించారు.
Updated On 27 March 2024 8:04 AM GMT
Yagnik

Yagnik

Next Story