Sajjala Ramakrishna Reddy : సజ్జలపై కేసు నమోదు చేసిన పోలీసులు
వైసీపీ ముఖ్య నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Criminal case against Sajjala Ramakrishna Reddy
వైసీపీ ముఖ్య నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. భారత శిక్షా స్మృతిలోని 153, 505(2), 125 RPA 1951 సెక్షన్ల కింద పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు దేవినేని ఉమ, న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
సజ్జల ఇటీవల మాట్లాడుతూ.. మన టార్గెట్ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని… దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు. మనకు అనుకూలంగా.. అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్ ని ఎలా చూసుకోవాలి ? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు (చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు) బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు ” అని సజ్జల అన్నారు.
