ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి, ఆయన చెల్లెలు వై.ఎస్‌.షర్మిలకు మధ్య ఆస్తుల పంచాయితీ ఉందనేది పాత మాట!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి, ఆయన చెల్లెలు వై.ఎస్‌.షర్మిలకు మధ్య ఆస్తుల పంచాయితీ ఉందనేది పాత మాట! ఇప్పుడు జగన్‌ తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారంటేనే ఆస్తుల గొడవ ఉన్నట్టు! ఇంత హడావుడిగా జగన్‌ ఎన్‌సీఎల్‌టీ(NCLT) వెళ్లడం వెనుక ఆస్తుల వ్యవహారం ఉందనుకుంటే పొరపాటే! జగన్‌ అంటేనే మండిపడుతున్న షర్మిలను అడ్డం పెట్టుకుని జగన్‌ బెయిల్‌ను రద్దు చేయించడానికి పెద్ద కుట్రే జరిగిందనే టాక్‌ వినిపిస్తోంది. దీన్ని ముందుగానే పసికట్టిన జగన్‌ న్యాయపరంగా ఓ అడుగు ముందుకేశారు. నిజానికి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడే వారసత్వంగా వచ్చిన ఆస్తులను జగన్‌, షర్మిల పంచేసుకున్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar reddy) చనిపోయిన తర్వాత జగన్ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఆయనపై సీబీఐ(CBI), ఈడీ(ED) పలు కేసులు పెట్టింది. దీంతో జగన్‌ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు, కంపెనీలు అటాచ్‌మెంట్‌లోకి వెళ్లిపోయాయి. అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు బదిలీచేయడం కాని, అమ్మడం కానీ చేయకూడదు. ఇది చట్ట వ్యతిరేకం! దీన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్‌ తన చెల్లిపై ఉన్న అనురాగాప్యాయతల కారణంగా తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో కొంత భాగాన్న చెల్లెలకు ప్రేమతో ఇవ్వాలనుకున్నారు. అటాచ్‌మెంట్లలో ఉన్న ఆస్తులను నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేయడం కుదరదు కాబట్టి చెల్లెలు షర్మిల(YS Sharmila)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ విధంగా రాసి ఇచ్చిన ఆస్తులలో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌(Saraswati Power and Industries) ఒకటి. కేసులు కొలిక్కి వచ్చిన తర్వాత వాటిని అప్పగిస్తానని జగన్‌ అందులో పేర్కొన్నారు. ఈ కంపెనీలో 99 శాతం షేర్లు జగన్‌ పేరిట ఉన్నాయి. ఒక శాతం షేర్లు విజయలక్ష్మికి ఉన్నాయి. చెల్లెలిపై ఉన్న ప్రేమ కొద్దీ ఆమెకు కూడా కొంత భాగాన్ని ఇస్తానని లిఖితపూర్వకంగా రాసిచ్చారు జగన్‌. కేసులు తేలాక ఆ షేర్లను షర్మిల పేరుమీద బదిలీచేసుకోవచ్చని 2019లో ఓ గిఫ్ట్‌ డీడ్‌ను రాసిచ్చారు. కోర్టుకేసుల్లో, అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏ రకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేని కారణంతో జగన్ గిఫ్ట్‌ డీడ్‌కు పరిమితం అయ్యారు.

ఇది జరిగిన కొంత కాలానికి షర్మిలకు రాజకీయ కోరికలు కలిగాయి. రాజకీయాల్లో తాను కూడా ఎదగాలన్నది ఆమె డ్రీమ్‌. అందుకే జగన్‌ వారించినా తెలంగాణలో ఆమె సొంతంగా ఓ పార్టీ పెట్టారు. ఎన్నికల వేళ ఆ పార్టీని క్లోజ్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వాలిపోయారు. అక్కడ కాంగ్రెస్‌కు చీఫ్‌ అయ్యారు. ప్రచారంలో జగన్‌ను ఇష్టం వచ్చినట్టుగా విమర్శించారు. జగన్‌ శత్రువులతో చేతులు కలిపారు. రాజకీయంగా జగన్‌కు చాలా నష్టాన్ని కలిగించారు. కడప(Kadapa)లో పోటీ చేశారు.ఇదే సమయంలో సరస్వతీ పవర్‌లో జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయలక్ష్మి(Vijayalaxmi) దగ్గర నుంచి ఒక శాతం షేర్లను బదిలీచేయించుకున్నారు. కోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈపరిణామం లీగల్‌గా పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీన్ని ఆసరాగా తీసుకుని బెయిల్‌ రద్దుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు జగన్‌కు తెలిసింది. ఆ మధ్యన చంద్రబాబును కలుసుకున్న వై.ఎస్‌.సునీత (YS Sunitha) ఈ అంశాన్ని కూడా చర్చించారట! దాంతో న్యాయ నిపుణుల సలహాతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్‌ (YS Jagan)లీగల్‌గా ఒక అడుగు ముందుకేయాల్సి వచ్చింది. తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై జగన్‌ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని వమ్ముచేయడమేనన్నారు. చంద్రబాబు(Chandra Babu)తో చేతులు కలిపిన షర్మిల కుట్రపూరితంగానే షేర్ల బదిలీకి ప్రయత్నించారన్నది పార్టీ అనుమానం! షర్మిలను అడ్డుపెట్టుకుని జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్‌ పసిగట్టారు. అందుకే నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(National Company Law Tribunal)ను ఆశ్రయించారు. పెను ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన జగన్‌ జాగ్రత్తపడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రక్త సంబంధీకులపై మమకారంతో ఇలాంటి విషయాలను నిర్లక్ష్యంచేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, అది పార్టీకి, క్యాడర్‌కు, పార్టీని నమ్ముకున్న ప్రజలకు ఇబ్బందులు తెస్తాయన్న ఆలోచనతోనే జగన్‌ ఈ చర్యకు దిగినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ehatv

ehatv

Next Story