Andhra Pradesh : గుడ్న్యూస్.. నేడు వరద బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేయనున్న సీఎం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేయనుంది
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగింది. విజయవాడ మునుపెన్నడూ చూడని వరదలకు అతలాకుతలం అయ్యింది. దీంతో 10 రోజులు పాటు సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని చంద్రబాబు నడిపించారు. అలాగే నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యుమరేషన్ పూర్తి చేసింది. బాధితులకు నష్ట పరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వరదల్లో నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని ముఖ్యమంత్రి నేడు విడుదల చేయనున్నారు. అర్హులైన బాధతులందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.