TDP Political Heir : టీడీపీకి వారసుడు ఎవరంటే..? చంద్రబాబు నోటి వెంట వచ్చిన మాట!
చంద్రబాబు నోటి వెంట వచ్చిన మాట!
తెలుగుదేశంపార్టీని(TDP) స్థాపించి, రేయింబవళ్లు కష్టపడి, తన గ్లామర్‌తో అధికారంలోకి తెచ్చిన ఎన్.టి.రామారావుకు ఆ పార్టీ చేతుల్లోంచి జారిపోయింది. కాదు కాదు, లాగేసుకున్నారు. అలా గుంజేసుకున్న వారు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీకి కర్త కర్మ క్రియ ఎవరనే సందేహం ఎవరికీ లేదు. ఎందుకంటే చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు(Lokesh Nara) కాకుండా మరొకరు టీడీపీ పగ్గాలను అందుకోవడం సహించలేరు. టీడీపీకి లోకేశే వారసుడు అన్నది చంద్రబాబు పలు సందర్భాలలో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే టీడీపీకి, ప్రభుత్వానికి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు లోకేశ్. లోకేశ్ గురించి చంద్రబాబు ఇప్పటి వరకు బహిరంగంగా ఏమీ చెప్పలేదు. చంద్రబాబులో తన కుమారుడి గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది? లోకేశ్ పనితీరుపై ఆయన భావన ఏమిటి? ఆయన మనసులో ఏముంది? ఇవన్నీ త్వరలో స్ట్రీమింగ్ అయ్యే అన్‌స్టాపబుల్(Unstopable) సీజన్-4లో తెలుస్తాయి. ఈ టాక్ షో నాలుగో సీజన్ చంద్రబాబుతోనే మొదలవ్వబోతున్నది. ఆ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. బాలకృష్ణ(Balakrishna), చంద్రబాబు మధ్య టీడీపీ గురించి చాలా చర్చే జరిగిందట! పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లను కూడా చర్చించుకున్నారట! టీడీపీ ఎవరి కోసమో చూస్తూ కూర్చోదని, అలాగే వారసత్వం అనేది వుండదని, కార్యకర్తగా మొదలై, నాయకుడిగా ఎదిగి తనను తాను ప్రూవ్ చేసుకున్నవారికే పగ్గాలు అందుతాయని చంద్రబాబు చెబుతూనే లోకేశ్ అలా తనకు తాను రుజువు చేసుకున్నారని అన్నారట! అందుకు బాలకృష్ణ కూడా అవునవుననే అన్నారట! అలాగని నందమూరి ఫ్యామిలీని కూడా ఇగ్నోర్ చేయలేదట! నందమూరి ఆడపడచులు కూడా పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారని ఇద్దరూ ముచ్చటించుకున్నారట!