Pithapuram Varma : రెంటికీ చెడిన పిఠాపురం వర్మ
ఎమ్మెల్సీగా తొలి అవకాశం నీకే అంటూ ఆశ చూపించి వర్మను పిఠాపురంలో వర్మను సైడ్‌లైన్ చేసిన చంద్రబాబు
సామెతలు ఉత్తినే పుట్టవు. ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సామెత కూడా చంద్రబాబునాయుడు(Chandrababu) వంటి వారిని చూసే పుట్టిందేమో! కంప్యూటర్‌కాడి నుంచి సెల్‌ఫోన్ వరకు అన్నింటినీ ఆయనే పుట్టించినట్టుగా ఈ సామెతను కూడా ఆయనే పుట్టించాడేమో! ఇప్పుడా సామెత ప్రస్తావన ఎందుకొచ్చిందంటే పాపం పిఠాపురం వర్మను చూసిన తర్వాత! సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) కోసం పిఠాపురంలో(Pithapuram) తన సీటును త్యాగం చేశారు వర్మ(Varma). అప్పుడు అభ్యర్థులను ప్రకటించినప్పుడు పిఠాపురంలో పెద్ద గొడవే జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట వర్మ అభిమానులు ఆందోళన చేశారు. వర్మ కూడా నారాజ్ అయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనే ఆలోచన కూడా చేశారు. చంద్రబాబు పలు హామీలు ఇచ్చి బుజ్జగించడంతో సర్దుకుపోయారు. భవిష్యత్తులోనైనా పిఠాపురంలో టీడీపీ తన లెగసీని కాపాడుకుంటుందా అంటే డౌటేనంటున్నారు టీడీపీ శ్రేణులు. ఎందుకంటే పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో తన సొంత పార్టీని నట్టేట ముంచుతున్నారు చంద్రబాబు అన్నది క్యాడర్ భావన. ఎమ్మెల్సీగా తొలి అవకాశం నీకే అంటూ ఆశ చూపించి వర్మను పిఠాపురంలో వర్మను సైడ్‌లైన్ చేసిన చంద్రబాబు ఆ మాట నిలుపుకోవడం లేదు. తాజాగా రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో వర్మ పేరు లేదు. అంటే వర్మకు హ్యాండిచ్చినట్టే అనుకోవాలి. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ చెందిన చాలా మంది నాయకులు త్యాగరాజులుగా మారిపోయారు. పాపం అప్పటి వరకు పార్టీ కోసం నియోజకవర్గాలలో సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీకి బలమిచ్చిన వారంతా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు, ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలకు కలిపి రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఉభయగోదావరి జిల్లాలకు అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణా- గుంటూరు జిల్లాలకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్టు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి స్థానాన్ని త్యాగం చేసిన ఆలపాటి రాజా ఒకప్పుడు మంత్రిగా కూడా పని చేశారు. పేరాబత్తుల రాజశేఖర్ కూడా అంతే! కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయాలని ఎంతో అనుకున్నారు కానీ జనసేన పార్టీ నాయకుడు పంతం నానాజీ కోసం ఆ సీటును త్యాగం చేశారు. ఇలా ఇద్దరు త్యాగమూర్తులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తున్న చంద్రబాబు మరో త్యాగశీలి వర్మను ఎందుకు విస్మరించినట్టు? ఎమ్మెల్సీకి కంటే పెద్ద పదవి ఇస్తానని చెప్పారా? లేక లైట్ తీసుకున్నారా? వర్మ రియాక్టవుతూనే అసలు విషయం తెలుస్తుంది.