'ప్రజలు గమనిస్తుంటారు జాగ్రత్త!' ఇది కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్న మాట!

'ప్రజలు గమనిస్తుంటారు జాగ్రత్త!' ఇది కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్న మాట! నిజమే.. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. అయినదానికి కాని దానికి జగన్మోహన్‌రెడ్డిని(YS Jagan) ఆడిపోసుకోవడాన్ని కూడా జనం గమనిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబుతో మొదలు పెడితే ప్రతి ఒక్కరు తమ ప్రసంగాల్లో జగన్‌ను తిట్టడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆవు వ్యాసంలా ప్రతీ అంశంలోనూ జగన్‌ను తీసుకొస్తున్నారు. గురువారం డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజును(Raghu rama krishnam raju) ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడటం సబబు. ఎవరూ ఆ పదవిలో నియమితులైనా ఆయన గురించి అందరూ మంచిగా మాట్లాడతారు. చంద్రబాబు కూడా రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడారు. ఎంత సేపంటే ఓ అయిదు నిమిషాలు.. మిగిలిన అరగంట సేపూ జగన్‌ను తిట్టడానికే కేటాయించారు. ఇది కూడా ప్రజలు గమనించే ఉంటారు. అసలు రఘురామకృష్ణరాజు నియామకానికి, జగన్‌ను తిట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? మెడికల్ షాపుకెళ్లి విస్తరాకులు అడిగినట్టుగా ఉంది. ఎన్నికల ముందు చెప్పిన సూపర్‌ సిక్స్‌ హామీల మాటేమిటని ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబు! ఆ విషయాన్ని వదిలేసి ఊరికే జగన్‌ను తిట్టుకుంటూ వెళుతుండటం బాగోదు. కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చండయ్యా అని ప్రజలు అడిగితే జగన్‌ ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగానే చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారట! ఇలా చెప్పుకోవడం నామోషీగా అనిపించడం లేదా చంద్రబాబు! తాము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు(Pawan kalyan) అనుకుంటే అంతకు మించిన అవివేకం మరోటి ఉండదు. ఏమీ చేయకుండా జగన్‌ను తిడుతూ కాలక్షేపం చేస్తే ప్రజలు ఊరుకోరు. మొన్నటి వరకు జగన్మోహన్‌రెడ్డి భారీగా అప్పులు చేశారని, అందుకే హామీలను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు తెగ ఫీలయ్యారు కదా! మరి మొన్న అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ అప్పు 6.50 లక్షల కోట్ల రూపాయలనేనని స్వయంగా ఆయనే కదా సెలవిచ్చింది. ఇప్పటికైనా పదే పదే జగన్‌ పేరు ఎత్తకుండా సూపర్‌ సిక్స్‌ హామీలపై దృష్టి పెడితే జనం హర్షిస్తారు. లేకపోతే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Eha Tv

Eha Tv

Next Story