Amaravati IRR: చంద్రబాబు, లోకేష్ లను వెంటాడుతున్న అమరావతి ఐఆర్ఆర్ కేసు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్ లను నిందితులుగా పేర్కొంటూ గురువారం నాడు సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ అలైన్ మెంట్ ద్వారా అనుచితంగా లబ్ది పొందాలని చూశారని సీఐడీ తన చార్జిషీట్ లో పేర్కొంది. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ కుంభకోణం జరిగిందని పేర్కొంది. అమరావతి వద్ద టీడీపీ నేతల భూములకు అధిక విలువ లభించేలా ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర కనెక్టివిటీ రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు చేశారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఐఆర్ఆర్ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు ముఠా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడిందని అభియోగాలు మోపబడ్డాయి.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్‌డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్‌మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. కానీ సీఆర్‌డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు.